భారత చదరంగంలో వెలుగులు.. క్రీడాకారుల కష్టాలు!

కలం, స్పోర్ట్స్ : భారత చదరంగం (Indian Chess) ఇప్పుడు స్వర్ణయుగంలో ఉంది. 2026 ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నీలో ఆర్. వైశాలి సాధించిన ఘనతను దేశం ఇంకా వేడుక చేసుకుంటుండగానే, ఇప్పుడు వైశాలి, గుకేష్ తమ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నారు. క్రికెట్ రాజ్యమేలే మన దేశంలో 64 గళ్ళ ఆట ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. గత వారం తమిళనాడుకు చెందిన ఎనిమిదేళ్ల తమిళ అముదన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఒక ఆన్‌లైన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ విన్సెంట్ కీమర్‌ను ఆయన ఓడించారు. ఇంట్లో కరెంటు లేకపోయినా, తండ్రి మొబైల్ హాట్‌స్పాట్ సాయంతో, ల్యాప్‌టాప్ బ్యాటరీ అయిపోతున్నా మొక్కవోని దీక్షతో ఆడి అముదన్ విజయం సాధించారు. ఈ గెలుపు దేశానికే గర్వకారణంగా నిలిచింది.

అయితే, చదరంగంలో (Indian Chess) రాణించడం పైన కనిపించే రంగుల ప్రపంచమంత సులభం కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆడుకున్నంత కాలం తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఆట, ప్రొఫెషనల్‌గా మారగానే భారంగా మారుతోంది. 12 ఏళ్ల ఆరవ్ సర్బాలియా తండ్రి యతిన్ మాట్లాడుతూ, తమ పొదుపు మొత్తమంతా ఈ ఆట కోసమే ఖర్చవుతోందని ఆవేదన చెందారు. ఏడాదికి మూడు, నాలుగు సార్లు యూరప్ ట్రిప్పుల కోసం కనీసం 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఆటగాళ్లు మైనర్లు కావడంతో ఒకరు తోడు వెళ్లక తప్పడం లేదు. దీనివల్ల ఖర్చు రెట్టింపు అవుతోందని, దీన్నే తల్లిదండ్రులు ‘పేరెంట్ ట్యాక్స్’గా పిలుస్తున్నారు.

డబ్బు ఉన్నా కూడా సరైన వ్యవస్థ లేకపోవడం మరో సమస్యగా మారింది. వీసా ఇంటర్వ్యూల సమయంలో అధికారుల ప్రశ్నలు చిన్నపిల్లలను కించపరిచేలా ఉంటున్నాయి. హంగేరీ ఎంబసీలో ఆరవ్‌ను “చదరంగానికి తండ్రి ఎవరు? తల్లి ఎవరు?” వంటి వింత ప్రశ్నలు అడిగి, తనకు ఆట రాదని అవమానించినట్లు యతిన్ గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో ట్యాక్సీ డ్రైవర్ల మోసాలకు గురవుతూ ఎంతో నేర్చుకోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఇండియాలో ఆడుదామంటే ఇక్కడి టోర్నీల నిర్వహణ సరిగా ఉండటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. రేటింగ్ పెంచుకోవడానికి విదేశీ టోర్నీలే దిక్కవుతున్నాయి. ఒక టోర్నీలో కచ్చితమైన రేటింగ్ ఉన్న వారు ఉండాలని నిబంధన ఉన్నా, మన దగ్గర చివరి నిమిషంలో తక్కువ రేటింగ్ ఉన్న వారిని అనుమతించడం వల్ల క్రీడాకారుల శ్రమ వృథా అవుతోంది.

ఢిల్లీకి చెందిన వన్షిక రావత్ తండ్రి విక్రమ్ మాట్లాడుతూ, కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించినా ఫెడరేషన్ నుండి కనీస గుర్తింపు లేదని వాపోయారు. దేశం కోసం ఆడితే మెడల్స్ వస్తాయి కానీ, రేటింగ్ పెరగడం లేదని, అందుకే దేశం తరుపున ఆడే కంటే విదేశాల్లో ప్రైవేట్ టోర్నీలు ఆడటమే మేలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. స్పాన్సర్‌షిప్‌లు కేవలం 16 ఏళ్లు దాటిన వారికే కాకుండా, చిన్న వయసులో రాణిస్తున్న వారికి కూడా ఇవ్వాలని డిల్లీ అండర్-7 ఛాంపియన్ ఆరిని లాహోటి తండ్రి సురేందర్ కోరుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు మారుతాయని కోచ్‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముంబై, గుజరాత్ వంటి నగరాల్లో గ్రాండ్ మాస్టర్లు ఎక్కువగా ఆడుతుండటంతో త్వరలోనే భారత్‌లో కూడా నాణ్యమైన టోర్నీలు జరుగుతాయని వారు ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>