ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుంది?: హరీశ్ రావు

కలం, నల్గొండ బ్యూరో: వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. కల్లాల్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు, రైతులకు ధైర్యం చెప్పారు.

జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ పెట్టి తాము చాలా బాగా వడ్లు కొంటున్నామని.. ఎవరికీ ఇబ్బంది లేదని గొప్పలు చెప్పారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘అయ్యా ఉత్తమ్.. నేను ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడటం లేదు. నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా’ అంటూ చురకలు అంటించారు. 44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ, పిట్టల్లాగా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమే అవుతుందని చెప్పారు. మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, సంచులివ్వడానికి వారం, కాంటాకు వారం, మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి .. గల్లీలకు వచ్చి రైతుల గోస వినండని సూచించారు. మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి వడ్ల కుప్పల వద్ద ముగ్గురు రైతులు, కొడుకు చనిపోయారుని చెప్పారు. నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పల మీదనే రైతు గుండె ఆగి చనిపోయాడని అన్నారు. ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుంది? అని ప్రశ్నించారు.

రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు ఈ వారోత్సవాలు చేస్తున్నారా? అని హరీశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర, దేశ చరిత్రలో యూరియా అమ్మకాలపై నిషేధం విధించిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దేనని విమర్శించారు. కూరగాయలు, ఆయిల్ పామ్ పండించే రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్ కొని నెలలు దాటుతున్నా రైతులకు ఒక్క రూపాయి వేయలేదని చెప్పారు. జొన్నలు, శనగలు కొననే లేదని.. కానీ 48 గంటల్లో పైసలు వేస్తున్నామని పచ్చి అబద్ధాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని మార్కెట్లకు సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపాలన్నారు. మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>