ఇండియన్3తో శంకర్‌కు మరో అవకాశం.. ఈ సారైనా హిట్ కొడతాడా!

కలం, సినిమా: దర్శకుడు శంకర్‌కు ఇండియన్ 3 (Indian 3) కేవలం విడుదల కోసం ఎదురుచూస్తున్న మరో సినిమా మాత్రమే కాదు. తన కెరీర్‌లోనే నిరాశపరిచిన చిత్రాల్లో ఇండియన్ 2 ఒకటి. ఆ మూవీతో కోల్పోయిన విజయాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు శంకర్‌కు మరో అవకాశం దక్కింది. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు అక్టోబర్ 8న చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు ఆగిపోయిందని భావించిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, ఈ సినిమాను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం శంకర్‌కు సరైన నిర్ణయమేనా? లేక ఇండియన్ 2 మిగిల్చిన చేదు అనుభవాన్ని మరింత పెంచుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 1996లో విడుదలైన భారతీయుడు మూవీ తమిళ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అవినీతిని అంతమొందించేందుకు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కమల్ హాసన్ చూపించిన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత విడుదలైన ఇండియన్ 2పై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత 2024లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. నిర్మాణంలో అనేక ఆటంకాలు, జాప్యాలు ఎదుర్కొన్న ఈ చిత్రానికి విడుదల తర్వాత కూడా ఆశించిన స్పందన లభించలేదు. కథనం, స్క్రీన్‌ప్లే, నటీనటుల ప్రదర్శనలు, కథను నడిపించిన తీరు వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

ఇండియన్ 2పై సోషల్ మీడియాలో ఊహించనివిధంగా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. సేనాపతి అసాధారణ పోరాటాలు నవ్వులపాలయ్యాయి. సిద్ధార్థ్ చెప్పిన కొన్ని డైలాగులు విస్తృతంగా మీమ్స్ రూపంలో వైరల్ అయ్యాయి. తమిళ సినిమాలోనే గుర్తింపు పొందిన విజిలాంటీ పాత్రల్లో ఒకటైన సేనాపతిని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినప్పటికీ, సినిమాకు ఇంతటి ప్రతికూల స్పందన రావడం చిత్ర బృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అవినీతిపై పోరాటం అనే ప్రధాన ఇతివృత్తం ఇప్పటికీ సమకాలీనమే అయినప్పటికీ, దానికి అవసరమైన ఉత్కంఠన, ఎమోషన్స్, బలమైన కథనం అందించలేకపోయింది. మరి ఇండియన్ 3తోనైనా శంకర్ ఈ లోపాలను సరిదిద్ది హిట్ కొడతాడా? అనేది వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>