జెన్ జీ తీర్మానంపై అసెంబ్లీకి సారొస్తారా?

కలం, తెలంగాణ బ్యూరో: ‘‘దేశంలో విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళనను చూసి కేసీఆర్ (KCR)  తల్లడిల్లిపోతున్నారు. వారి భవిష్యత్తు కోసం అవసరమైతే బయటకు వస్తారు. తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది.. జెన్ జీతో ప్రధాని మోదీ జాగ్రత్త..’’ ఈ నెల 24న ధర్నాచౌక్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన హెచ్చరిక ఇది.

‘‘చట్టసభల్లోకి జెన్ జీ రావాలి. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలి. ఇందుకోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం.’’ ఇదీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట.

బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ..

ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ స్పెషల్ సెషన్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోది. అయితే.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తారా? అనేదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి మారినప్పటి నుంచి బీఆర్ఎస్ చీఫ్ అసెంబ్లీకి వచ్చింది మూడు నాలుగు సార్లు మాత్రమే. అదీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కానీ, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ జెన్ జీ జపం అందుకోవడం.. వారి కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్‌లో తీర్మానం చేస్తామని సీఎం చెప్పడంతో ఈ తీర్మానాన్ని ఆమోదించేందుకైనా కేసీఆర్ వచ్చి చర్చలో పాల్గొంటారా? అనేది బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఢిల్లీలో ఉద్యమంతో పార్టీల్లో ఊపు..

ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన ఉద్యమాన్ని చూసి రాజకీయ పార్టీలన్నీ జెన్ జీ బాట పడుతున్నాయి. యూత్ ఎక్కువగా వాడుకున్న ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రధాని మోదీ ఫోకస్ పెడితే.. యువ సంగ్రామ సదస్సు పేరుతో బీఆర్ఎస్ సభ పెట్టింది. ఈ రెండింటికీ మాస్టర్ స్ట్రోక్ తరహాలో సీఎం రేవంత్‌రెడ్డి చట్టసభల్లో జెన్ జీకి అవకాశం కల్పించేలా.. పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదన తెచ్చారు. దీని కోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ పెట్టి తీర్మానాన్ని ప్రవేశపెడుతామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలకు తగ్గట్టు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతామని చెప్పారు.

కేటీఆర్ చెప్పినట్లు బయటకొస్తారా?

ఢిల్లీలోని జంతర్ మంతర్ లాఠీఛార్జి ఘటన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలపై హైదరాబాద్‌లో ఇటీవల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సభకు కేటీఆర్ హాజరయ్యారు. “ఈ నిరసనకు కేసీఆర్ రాకపోయినా యువత భవిష్యత్తుపై ఆయన తల్లడిల్లుతున్నారు. అవసరమైతే బయటకు వస్తారు.” అని వ్యాఖ్యానించారు. ‘యువత కోసం తల్లడిల్లుతున్న కేసీఆర్ యూత్ కోసమే పెడుతున్న చర్చలో పాల్గొంటారా?.. లేదా?.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ మీద ‘ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు..’ అనే నిందలు ఉన్న పరిస్థితుల్లో ఆయన హాజరు ఆసక్తికరంగా మారింది.

ఆ బాధ్యత కేటీఆర్‌దేనా..?

‘యువత కోసం తల్లడిల్లుతున్న కేసీఆర్’ హాజరయ్యేలా చూడటం కేటీఆర్ బాధ్యతగా మారిందని బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చకు హాజరు కాకపోతే ఎందుకు రాలేదనే అంశంపై కేసీఆర్ తరఫున ప్రత్యర్థులకు కేటీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. యూత్‌ను ఓటు బ్యాంకుగా మల్చుకోడానికి ధర్నాచౌక్‌ను వేదికను ఎంచుకున్న కేటీఆర్.. ఇప్పుడు కీలకమైన అంశంలో చట్టసభల్లో జరిగే చర్చకు కేసీఆర్ రాకపోతే యూత్‌ను కన్విన్స్ చేసే బాధ్యత కూడా కేటీఆర్‌పైనా పడుతుంది. ఇది ఎన్నికల సమయంలో మైలేజ్ రావడానికి బదులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు కలవరపడుతున్నాయి.

సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఆలోచనలు, సామాజిక స్పృహను గమనంలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మొత్తం కాంగ్రెస్ తరఫునే కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పుడు జెన్ జీ యూత్‌ చట్టసభల్లో ఎంటర్ అయ్యేలా.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే కనీస వయోపరిమితిని తగ్గించే విషయంలోనూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం భావిస్తున్నారు.

ఇదే జరిగితే.. అలా తీర్మానం చేసిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కుతుంది. ఈ అంశంలో సీఎం రేవంత్ ప్రతిపాదన మిగిలిన పార్టీలు వ్యతిరేకించలేని అనివార్య పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ వైఖరి తేటతెల్లం కానున్నది. కేసీఆర్ హాజరు కేటీఆర్‌కు కూడా ప్రతిష్టాత్మకంగా, సవాల్‌గా మారబోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>