కలం, వెబ్ డెస్క్ : భారత అథ్లెటిక్స్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం లిఖించబడనుంది. ప్రతిష్టాత్మకమైన 2028 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్స్ (World Athletics Indoor Championships) కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ ను భువనేశ్వర్‌లోని కళింగ ఇండోర్ స్టేడియంలో (Kalinga Indoor Stadium) నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూ అధికారికంగా ప్రకటించారు. పోలాండ్‌లోని తోరున్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు జనవరి నెలలో కౌన్సిల్ సభ్యులు భువనేశ్వర్‌లోని వసతులను పరిశీలించి, అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో 2004లో న్యూఢిల్లీలో వరల్డ్ హాఫ్ మారథాన్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించింది.
ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు ఒడిశా ప్రధాన చిరునామాగా మారింది. 2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్, గతేడాది జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ వంటి అంతర్జాతీయ పోటీలకు ఈ రాష్ట్రం వేదికైంది. ఇదే క్రమంలో మార్చి 24, 25 తేదీల్లో తొలి జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ((World Athletics Indoor Championships)) కూడా కళింగ స్టేడియంలోనే జరగనున్నాయి. నీరజ్ చోప్రా ఒలింపిక్, వరల్డ్ మెడల్స్ సాధించినప్పటి నుండి భారత అథ్లెటిక్స్‌పై ప్రపంచ దృష్టి పడింది. స్టీపుల్‌ఛేజ్ విభాగంలో అవినాష్ సాబుల్, ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో గుల్వీర్ సింగ్ సరికొత్త రికార్డులు సృష్టించారు. భారత అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం వల్లే ఈ అవకాశం దక్కిందని సాగూ అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణ ద్వారా భారత అథ్లెటిక్స్ స్థాయి మరింత పెరుగుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: తెలంగాణ బడ్జెట్ స్పెషల్ : ప్రతీ కుటుంబానికి భరోసా
Follow Us On: X(Twitter)

