కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(Telangana Budget 2026) ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా విస్మరించిందని, ముఖ్యంగా బీసీలకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) తీవ్రంగా విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌లో జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ (BC)లకు కనీసం 5 శాతం నిధులు కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
సమగ్ర సర్వేలో బీసీల జనాభాను 40 లక్షలకు పైగా తగ్గించి చూపడమే కాక, కామారెడ్డిలో ఆర్భాటంగా ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లను కేటాయిస్తామని ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. మంత్రివర్గంలో యాదవ, మున్నూరుకాపు, రజక, లంబాడీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం, బడ్జెట్‌లో ఆ అంశం ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే మంత్రివర్గంలో ముగ్గురు బీసీలకు స్థానం కల్పించాలని ఆయన (Vaddiraju Ravichandra) డిమాండ్ చేశారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పార్లమెంటులో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని కోరారు.
Read Also: తెలంగాణ బడ్జెట్ స్పెషల్ : ప్రతీ కుటుంబానికి భరోసా
Follow Us On : WhatsApp

