కలం, స్పోర్ట్స్ : భారత రోయింగ్ (India Rowers) రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026 ఆసియా గేమ్స్, ఇతర అంతర్జాతీయ పోటీల కోసం ఏకంగా 22 మంది రోవర్లను ప్రతిష్టాత్మక ‘టాప్స్’ (TOPS) డెవలప్‌మెంట్ గ్రూప్‌లోకి ఎంపిక చేసింది. మిషన్ ఒలింపిక్ సెల్ (MOC) సోమవారం నిర్వహించిన తన 174వ సమావేశంలో ఈ జాబితాను ఖరారు చేసింది.
రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (RFI) ఇటీవల నిర్వహించిన జాతీయ ఎంపిక ట్రయల్స్ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయి. ఈ 22 మంది రోవర్లు మొత్తం ఆరు బోట్ కేటగిరీలలో అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున పోటీ పడనున్నారు. ఈ బృందంలో ఒలింపియన్ బలరాజ్ పన్వర్, ఆసియా గేమ్స్ మెడలిస్టులు అర్వింద్ సింగ్, జస్విందర్ సింగ్ లాంటి స్టార్ క్రీడాకారులు ఉన్నారు.
వివిధ కేటగిరీల్లో ఎంపికైన రోవర్ల వివరాలు:
మెన్స్ సింగిల్ స్కల్స్: అర్వింద్ సింగ్
మెన్స్ డబుల్ స్కల్స్: నవదీప్ సింగ్, కుల్విందర్ సింగ్
మెన్స్ క్వాడ్రపుల్ స్కల్స్: బలరాజ్ పన్వర్, సత్నామ్ సింగ్, జాకర్ ఖాన్, సల్మాన్ ఖాన్
లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్: లక్షయ్, ఉజ్వల్ కుమార్ సింగ్
మెన్స్ కాక్స్డ్ ఎయిట్: జస్విందర్ సింగ్, నితిన్ కుమార్, బాబులాల్ యాదవ్, యోగేష్ కుమార్, ఘుర్డే విపుల్ సతీష్, సౌరవ్ కుమార్, ఇక్బాల్ సింగ్, సన్నీ కుమార్, ధనంజయ్ ఉత్తమ్ పాండే
ఉమెన్స్ కాక్స్‌లెస్ ఫోర్స్: గుర్బానీ కౌర్, పూనమ్, టెండెంతోయ్, అలీనా ఆంటో
వ్యక్తిగత మెడల్స్ తో పాటు అన్ని విభాగాలలోనూ భారత రోయింగ్ జట్టు బలాన్ని పెంచడమే ఈ ఎంపిక ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం వీరి దృష్టి 2026 ఆసియా గేమ్స్ పై ఉన్నప్పటికీ, భారత్‌లో జరగబోయే 2030 కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది ఉత్సవాల నాటికి బలమైన జట్టును సిద్ధం చేయడం కూడా ఇందులో భాగం. 1986 తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో రోయింగ్ కనిపించలేదు, కానీ 2030లో ఇది తిరిగి వచ్చే అవకాశం ఉంది.

