కరీంనగర్ కేంద్రంగా టెండర్ బియ్యం రీపాలిషింగ్

కలం, కరీంనగర్ బ్యూరో: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ దొడ్డు బియ్యం వేలం ప్రక్రియ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో సేకరించి గోదాములలో  నిల్వ ఉంచిన దొడ్డు బియ్యం టెండర్ల కేటాయింపు, అనంతరం దాని వినియోగంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌కు (Karimnagar) చెందిన ఓ ప్రముఖ రైస్ మిల్లర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు రాజకీయ, ప్రజాసంఘాలలో  చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణల ప్రకారం, ప్రజల వినియోగానికి పనికిరాదని భావించి వేలం వేసిన దొడ్డు బియ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా రీ-పాలిషింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలగడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ధర తగ్గించాక టెండర్లకు స్పందన

తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో సివిల్ సప్లైస్ గోదాములలో లక్ష టన్నులకు పైగా దొడ్డు బియ్యం నిల్వలు మిగిలిపోయాయి. మూడు సంవత్సరాలుగా నిల్వ ఉండటంతో వాటిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట కిలోకు రూ.24 కనీస ధర నిర్ణయించినప్పటికీ బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో, అనంతరం ధరను రూ.21.60కు తగ్గించారు. దీంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులతో పాటు కరీంనగర్‌కు చెందిన ఓ ప్రముఖ రైస్ మిల్లర్ 56,500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని టెండర్ల ద్వారా దక్కించుకున్నట్లు సమాచారం.

రీ-పాలిషింగ్‌పై ఆరోపణలు

టెండర్ ద్వారా దక్కించుకున్న బియ్యాన్ని తొలుత కరీంనగర్ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో రీ-పాలిషింగ్ చేసేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అయితే నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ 11 రైస్ మిల్లులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. అయినప్పటికీ టెండర్ బియ్యాన్ని ఇతర మిల్లులకు తరలించి రహస్యంగా రీ-పాలిషింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రసాయనాల సహాయంతో దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంలా మార్చి తిరిగి మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

నిబంధనలు ఏమంటున్నాయి?

వేలం ద్వారా విక్రయించిన దొడ్డు బియ్యాన్ని కేవలం పశువుల దాణా, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ తయారీ వంటి పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలి. రీ-పాలిషింగ్ చేసి మానవ వినియోగానికి విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ఈ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయకూడదనే నిబంధన కూడా అమలులో ఉంది. అయితే రీ-పాలిషింగ్ చేసిన బియ్యాన్ని ఇతర మిల్లులకు విక్రయించడం లేదా సీఎంఆర్ సర్దుబాట్లకు వినియోగించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వందల కోట్ల లాభాల ఆరోపణ

56,500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం టెండర్ విలువ సుమారు రూ.122.04 కోట్లుగా అంచనా. రీ-పాలిషింగ్ ద్వారా దాదాపు 70 శాతం వరకు సన్నబియ్యం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో సన్నబియ్యం రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయమవుతోంది. ఈ లెక్కన రీ-పాలిషింగ్ చేసిన బియ్యాన్ని మార్కెట్‌లో విక్రయిస్తే రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంలో భారీ అక్రమ లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజారోగ్యంపై ఆందోళన

నిల్వ కారణంగా నాణ్యత కోల్పోయిన బియ్యాన్ని రసాయనాలతో రీ-పాలిషింగ్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బియ్యం వినియోగం వల్ల జీర్ణకోశ సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, జిల్లాలో టెండర్ బియ్యానికి రీ-పాలిషింగ్ అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రీ-పాలిషింగ్ చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే అది నేరమని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విచారణకు డిమాండ్

ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. టెండర్ల కేటాయింపుల నుంచి గోదాముల నుంచి బియ్యం తరలింపు, రీ-ప్రాసెసింగ్ వరకు ప్రతి అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రభుత్వానికి గండి కొట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా, తెలంగాణ రక్షణ సమితి జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అనుమానిత రైస్ మిల్లులు, పౌరసరఫరాల గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అవసరమైతే నిల్వలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>