బిర్యానీ, సమోసా, పిజ్జా చూస్తే నోరూరుతుందా.. అసలు కారణమిదే!

కలం, నేషనల్ డెస్క్: బరువు తగ్గాలని చాలా గట్టిగా అనుకుంటాం. జిమ్‌లో గంటలకొద్దీ చెమటోడుస్తాం. కానీ, కళ్ల ముందు వేడివేడి సమోసానో, పిజ్జా, బర్గరో కనిపిస్తే అంతే సంగతులు..! ఇక నోరూరించే బిర్యానీ వాసన తగిలిందంటే.. డైటింగ్ను పక్కనపెట్టి కడుపు నిండా ఆరగించేస్తాం. మనల్ని ఇంతగా జంక్ ఫుడ్ వైపు లాగేసే ఆ క్రేవింగ్స్ వెనుక నాలుక రుచి మాత్రమే లేదట. మన మెదడులోని ఓ చిన్న ప్రొటీన్‌కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని తాజా అధ్యయనంలో తేలింది. కొవ్వు పదార్థాలు కనిపించగానే మనసు ఎందుకు పక్కదారి పడుతున్నదని.. జపాన్‌ పరిశోధకులు (Japanese Study) చేసిన రీసెర్చ్‌లో ఈ కొత్త విషయం ఆసక్తి రేపుతున్నది. అసలు ఇంతకీ ఆ ప్రొటీన్‌ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా.. క్రేవింగ్స్ ముందు మన సంకల్పం ఎందుకు వీగిపోతున్నది? ‘కలం’ సండే స్పెషల్లో..

పిజ్జా, బర్గర్ కనిపిస్తే ఆగలేకపోతున్నారా..? నోరూరించే బిర్యానీ వాసన వస్తే డైట్‌సంగతి మరిచిపోతున్నారా..? అయితే, తప్పు మీది కాదు.. మెదడులోని ఆ ‘ప్రొటీన్’దే..! మితిమీరిన ఫ్యాట్ క్రేవింగ్స్ వెనుక దాగున్న చిక్కుముడి కొంత వీడింది. జపాన్లోని ఒసాకా మెట్రోపాలిటన్‌యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఓపీఏ–1 (ఆప్టిక్ అట్రోఫీ-1) అనే ప్రొటీన్‌తెరపైకి వచ్చింది. సాధారణంగా మన మెదడులో ‘హైపోథాలమస్’ అనే భాగం శరీర ఆకలిని, శక్తి సమతుల్యతను కంట్రోల్ చేస్తుంటుంది. ఇందులోని కొన్ని ప్రత్యేక నాడీకణాల్లోనే ఈ ప్రోటీన్ ఉంటుంది. అంటే, మనం ఏం తినాలి? ఎంత తినాలి? అని మెదడు తీసుకునే నిర్ణయాల వెనుక ఈ చిన్న ప్రొటీన్‌పాత్ర కూడా ఉందన్న మాట.

ఏమిటీ పరిశోధన..?

అసలు ఈ ప్రొటీన్‌లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్న శాస్త్రవేత్తలు.. ఎలుకలపై ఓ కీలక ప్రయోగం చేశారు. వాటి మెదడులో ఆకలి, ఆహార నియంత్రణకు సంబంధించిన ఎంసీ4ఆర్‌నాడీకణాల నుంచి ఓపీఏ–1 ప్రొటీన్ను తొలగించారు. ఆ తర్వాత సాధారణ ఆహారంతో పాటు కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని వాటికి అందుబాటులో ఉంచారు. ఇక్కడే అసలు ట్విస్ట్‌మొదలైంది..! ఓపీఏ–1 లేని ఎలుకలు సాధారణ ఆహారం కంటే కొవ్వు పదార్థాలనే ఎక్కువగా తినడం మొదలుపెట్టాయి. ఇలా తినడం పెరగడంతో వాటి శరీర బరువు కూడా వేగంగా పెరిగి, ఊబకాయం లక్షణాలు కనిపించాయి.

ఆడవారిలోనే ఎక్కువ!

ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే… మగ ఎలుకలతో పోలిస్తే ఆడ ఎలుకల్లో ఓపీఏ–1 ప్రోటీన్ లోపం వల్ల ఫ్యాట్ ఫుడ్స్ తినాలనే కోరిక, దానివల్ల బరువు పెరిగే వేగం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఓపీఏ–1 ప్రొటీన్‌లోపం ఊబకాయం చికిత్సపై కూడా ప్రభావం చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ఆకలిని తగ్గించేందుకు ఉపయోగించే సెట్మెలనోటైడ్‌అనే ఔషధం మగ ఎలుకల్లో బాగా పనిచేసింది. కానీ ఓపీఏ–1 లేని ఆడ ఎలుకల్లో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. దీంతో ఊబకాయం మందులకు స్పందించే విషయంలోనూ ఆడ, మగ మధ్య జీవశాస్త్రపరమైన తేడాలు ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

భవిష్యత్తు చికిత్సలకు మార్గం

ఈ ఫలితాలు మనుషులకూ వర్తిస్తాయా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. ప్రస్తుతానికి ఈ పరిశోధన ఎలుకలపైనే జరిగింది. మనుషుల్లోనూ ఓపీఏ–1 ఇదే విధంగా కొవ్వు పదార్థాలపై క్రేవింగ్స్‌, ఆహార ఎంపిక, ఊబకాయాన్ని ప్రభావితం చేస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయినప్పటికీ ఈ పరిశోధన భవిష్యత్తులో ఊబకాయం చికిత్సకు కొత్త దారులు చూపించనుందని, మనుషుల్లోనూ ఓపీఏ–1 ఇదే విధంగా పనిచేస్తుందని నిర్ధారణ అయితే.. ఈ ప్రొటీన్ ఆధారంగా పనిచేసే మెదడు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కొత్త మందులను అభివృద్ధి చేయొచ్చని చెప్తున్నారు.

క్రేవింగ్‌ తగ్గాలంటే ఏం చేయాలి

  • ఫ్యాట్ ఫుడ్‌కనిపించగానే నోరూరించడం సహజమే. అయితే, క్రేవింగ్‌వచ్చిన ప్రతిసారీ దానికి లొంగిపోవాల్సిన అవసరం లేదు.
  • ఆహారాన్ని ముందుగానే ప్లాన్‌చేసుకోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండకుండా చూడటం, ప్రొటీన్‌, ఫైబర్‌ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత
  • నిద్రపోవడం వంటి అలవాట్లు క్రేవింగ్స్‌కు అదుపులో ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా మనకు ఏ సమయంలో, ఎలాంటి ఆహారంపై క్రేవింగ్‌ఎక్కువగా వస్తుందో గుర్తించి.. ఆ ట్రిగ్గర్స్‌కు దూరంగా ఉండాలని చెప్తున్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>