కలం, వెబ్ డెస్క్ : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) కరీబియన్ దీవుల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించారు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జైపూర్ ఫుట్ క్యాంప్ విజయవంతం కావడంతో ట్రినిడాడ్ టొబాగోలోని పీనల్‌లో శాశ్వత కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి కమల ప్రసాద్ బిసేసర్ పాల్గొన్నారు. గతంలో ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా ఎనిమిది వందల మందికి పైగా దివ్యాంగులు ప్రయోజనం పొందారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జైశంకర్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జైపూర్ ఫుట్ (Jaipur Foot) సాంకేతికత ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం వైద్య సహాయం మాత్రమే కాదు. దివ్యాంగులకు గౌరవం ప్రసాదించే అద్భుత కానుక. ట్రినిడాడ్ టొబాగోతో పాటు కరీకామ్ (CARICOM) ప్రాంతంలోని ఇతర దేశాలకు సైతం ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడనుంది. భారత్ నుంచి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా జైశంకర్ హామీ ఇచ్చారు.

