కలం, వెబ్ డెస్క్: భారత మహిళల డెఫ్ క్రికెట్ జట్టు (India Deaf Women Cricket Team) చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. శ్రీలంక వేదికగా తొలిసారి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 7 నుంచి 13 వరకు ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. సిరీస్‌కు ముందు న్యూఢిల్లీలో జట్టు జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమిత్ జైన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుమిత్ జైన్ మాట్లాడుతూ, భారత డెఫ్ మహిళల క్రికెట్‌కు ఇది కీలక ఘట్టమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం కష్టపడిన ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారని చెప్పారు.
ఈ పర్యటన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మాజీ భారత మహిళల క్రికెట్ కెప్టెన్ డయానా ఎడుల్జీ కూడా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. వినికిడి సమస్య ఆటకు అడ్డంకి కాదని ఈ ఆటగాళ్లు నిరూపించారని అన్నారు. ప్రపంచానికి తమ ప్రతిభ చూపించే సమయం వచ్చిందని చెప్పారు. జట్టు కెప్టెన్ కాజల్ ధావన్ మాట్లాడుతూ, ఇది తమ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణమని తెలిపారు. దేశం కోసం ఆడటం గర్వంగా ఉందని, ప్రతి ఆటగాడు ఎంతో కష్టపడి ఈ అవకాశాన్ని సంపాదించుకున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా భవిష్యత్ టోర్నీలను కూడా ప్రకటించారు. 2027లో మహిళల డెఫ్ టీ20 త్రైపాక్షిక సిరీస్, 2028లో ఢిల్లీలో మహిళల డెఫ్ టీ20 ప్రపంచకప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటన భారత డెఫ్ మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది కానుంది.

