దేశవాళీలో అరుదైన బౌలర్.. మళ్లీ తెరపైకి బాలూ గుప్తే!

కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్‌లో గొప్ప దేశవాళీ బౌలర్ బాలూ గుప్తే (Baloo Gupte) కథ మళ్లీ తెరపైకి వచ్చింది. లెగ్‌స్పిన్, గూగ్లీతో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా కానీ టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బాలూ గుప్తేకు మరో ప్రత్యేకత ఉంది. ఆయన అన్నయ్య సుభాష్ గుప్తే కూడా గొప్ప లెగ్‌స్పిన్నర్. సుభాష్ భారత జట్టులో 36 టెస్టులు ఆడి 149 వికెట్లు తీశారు. దీంతో బాలూ కెరీర్ ఎక్కువగా అన్నయ్య నీడలోనే సాగింది.

పాకిస్థాన్‌తో అరంగ్రేటం..

1961లో పాకిస్థాన్‌తో టెస్టులో బాలూ అరంగేట్రం చేశారు. అప్పటికే సుభాష్ జట్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో బాలూ 35 ఓవర్లు వేసి 116 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఆ తర్వాత మరో రెండు టెస్టులు ఆడారు. మొత్తం మూడు టెస్టుల్లో మూడు వికెట్లతోనే ఆయన కెరీర్ ముగిసింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో బాలూ గుప్తే రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 417 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 255 వికెట్లు పడగొట్టారు.

పది వికెట్లు తీసి..

1962-63 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్ తరఫున ఆడిన బాలూ 55 పరుగులకు 9 వికెట్లు తీశారు. దాదాపు 38 ఏళ్ల పాటు ఇదే దులీప్ ట్రోఫీ అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది. 2001లో దేబాశిష్ మొహంతీ 46 పరుగులకు 10 వికెట్లు తీసి ఆ రికార్డును అధిగమించారు. టెస్టుల్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. దేశవాళీ క్రికెట్‌లో ఆయన సాధించిన 417 వికెట్లు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. 1934 ఆగస్టు 30న జన్మించిన ఆయన 2005లో 70 ఏళ్ల వయసులో బాలూ గుప్తే కన్నుమూశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>