న్యూజిలాండ్‌పై గెలుపుతో భారత్ రికార్డ్‌ల సునామీ..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న నానుడిని మనమంతా వినే ఉంటాం. కానీ భారత్.. టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup)లో ఘన విజయం సాధించి ఈ ఒక్క విజయంతో భారత్ రికార్డ్‌ల సునామీ సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ (India), క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాత క్రికెట్ రికార్డుల (Cricket records)ను చెరిపివేసి సరికొత్త మైలురాళ్లను అందుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా జట్టుగా 7 రికార్డ్‌లను సృష్టించగా, వ్యక్తిగతంగా భారత ప్లేయర్లు మరో 5 రికార్డ్‌లను నెలకొల్పారు.

టీమ్ ఇండియా సృష్టించిన రికార్డులు…
వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్:

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ వరుసగా రెండు సార్లు టైటిల్‌ను గెలవలేదు. 2024లో ట్రోఫీ గెలిచిన భారత్, 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. తన ఛాంపియన్ షిప్‌ను కాపాడుకుంటూ ఈసారి కూడా విశ్వవిజేతగా నిలిచింది. దీంతో వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు వెస్టిండీస్ 2012, 2016లో రెండు సార్లు గెలిచినా మధ్యలో 2014లో గెలవకపోవడంతో ఆ ఖాళీ ఉంది. అలాగే ఇంగ్లండ్ కూడా రెండు టైటిళ్లు గెలిచింది కానీ వరుసగా కాదు.

అత్యధిక ప్రపంచకప్ టైటిళ్లు:

వరుసగా రెండుసార్లు విశ్వవిజేతగా నిలవడమే కాకుండా అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన రికార్డ్‌ను కూడా భారత్ నెలకొల్పింది. నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై సాధించిన భారీ విజయంతో మొత్తం మూడు సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 2007, 2024, 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్స్‌ను భారత్ సొంతం చేసుకుంది. 2026 వరల్డ్ కప్‌కు ముందు వరకు ఈ రికార్డ్.. అత్యధికంగా రెండు టైటిళ్లకు మాత్రమే పరిమితం అయింది. రెండుసార్లు టైటిల్స్ సాధించిన జట్లలో వెస్టిండీస్, ఇంగ్లండ్ ఉన్నాయి. న్యూజిలాండ్‌పై గెలవడంతో భారత్ ఈ మార్చ్‌ను భారత్ దాటి మూడో సారి టైటిల్ సాధించిన తొలి జట్టుగా రికార్డ్ సృష్టించింది.

ఫైనల్‌లో అత్యధిక స్కోరు:

గెలవడంతోనే కాదు వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో చేసిన స్కోరుతో కూడా భారత్ రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన 255/5 స్కోరు ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డ్ గతంలో కూడా భారత్ పేరిటే ఉంది. 2024 ఫైనల్‌లో భారత్ చేసిన 176/7 స్కోరు అత్యధికంగా ఉండేది. ఈసారి భారత్ తన స్వంత రికార్డునే దాదాపు 79 పరుగులతో అధిగమించింది.

పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు:

వీటితో పాటు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను కూడా భారత్ సొంతం చేసుకుంది. మొదటి ఆరు ఓవర్లలో భారత్ వికెట్ కోల్పోకుండా 92 పరుగులు చేసింది. ఇంతకు ముందు ప్రపంచకప్ ఫైనల్‌లో పవర్‌ప్లేలో అత్యధికంగా నమోదైన స్కోరు 77 పరుగులు. ఆ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. భారత్ ఆ రికార్డును భారీగా అధిగమించింది.

సొంత గడ్డపై టైటిల్:

ఇరవై ఓవర్ల ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం తన గడ్డపై ట్రోఫీ గెలవలేదు. 2012లో శ్రీలంక ఫైనల్స్‌లో ఓడింది. 2016లో భారత్.. సెమీఫైనల్‌లో నిష్క్రమించింది. కానీ ఆ సెంటిమెంట్‌కు భారత్.. ఈ వరల్డ్ కప్‌తో బ్రేకులు వేసింది.

200 పైగా స్కోర్లలో రికార్డు:

అంతర్జాతీయ 20 ఓవర్ల క్రికెట్ చరిత్రలో 200కి పైగా స్కోర్లు చేయడంలో కూడా భారత్ ముందుంది. న్యూజిలాండ్‌ (New Zealand)పై మ్యాచ్‌తో భారత్ 50 సార్లు 200కుపైగా స్కోరు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో దాదాపు 40 సార్లు 200కి పైగా స్కోరు చేసి ఆస్ట్రేలియా, 40సార్లకు దగ్గరగా స్కోర్ చేసి ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉన్నాయి.

భారీ తేడాతో విజయం:

వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించడంలో కూడా భారత్ రికార్డ్ చేసింది. న్యూజిలాండ్‌పై భారత్ ఈ మ్యాచ్‌ను 96 పరుగుల తేడాతో గెలిచింది. ఇంతకు ముందు ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యధికంగా 85 పరుగుల తేడాతో విజయం సాధించడం వెస్టిండీస్ పేరిట ఉంది. భారత్ ఆ రికార్డును అధిగమించింది.

ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు:

ఇక ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డ్‌ల విషయానికి వస్తే మనం ముందుగా ఓపెనర్, మ్యాచ్ విన్నర్ సంజూ శాంసన్ రికార్డ్ గురించే చప్పాలి. వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్‌గా సంజూ రికార్డ్ చేశాడు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో సంజూ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఫైనల్‌లో అత్యధిక స్కోరు మార్లన్ శ్యాముల్ పేరిట ఉండేది. అతడు 85 నాటౌట్‌గా ఉన్నాడు. సంజూ ఆ రికార్డును నాలుగు పరుగులతో అధిగమించాడు.

అత్యధిక సిక్సర్లు:

ఈ టోర్నీతోనే సంజూ మరో రికార్డ్ కూడా సృష్టించాడు. అదే వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టడం. ఈ ప్రపంచకప్‌లో సంజూ మొత్తం 24 సిక్సర్లు కొట్టాడు. ఇంతకు ముందు రికార్డు 22 సిక్సర్లతో క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2016 టీ20 వరల్డ్ కప్‌లో గేల్ ఈ రికార్డ్ నెలకొల్పాడు.

సంజూ ఆ రికార్డును కూడా దాటాడు:

సంజూ శాంసన్ ముచ్చటగా మూడో రికార్డ్‌కు కూడా సృష్టించాడు. ఒకే టోర్నీలో సెమీ ఫైనల్, ఫైనల్ రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ, షాహిద్ అఫ్రిది పేరిట ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో సంజూ పేరు కూడా చేరింది.

అభిషేక్ రికార్డ్:

ఈ మ్యాచ్‌తో అభిషేక్ శర్మ కూడా తన పేరిట ఒక రికార్డ్‌ను రాసుకున్నాడు. అదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. కేవలం 18 బంతుల్లో అభిషేర్ అర్థశతకం చేసేశాడు. ఇంతకు ముందు ప్రపంచకప్ ఫైనల్‌లో వేగవంతమైన అర్థశతకం చేసిన ప్లేయర్ల జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ 23 బంతుల్లో ఉన్నాడు. అభిషేక్ ఆ రికార్డును ఐదు బంతులు తక్కువలోనే అధిగమించాడు.

నాకౌట్ మ్యాచ్‌లలో వేగవంతమైన అర్థశతకం:

ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో కూడా అభిషేక్‌దే వేగవంతమైన అర్థశతకం. ఇంతకు ముందు ఈ రికార్డు 1 బంతుల్లో యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. అభిషేక్ ఆ రికార్డును కూడా అధిగమించాడు.

టాప్–3 బ్యాటర్ల అరుదైన ఘనత:

ఈ మ్యాచ్‌లో భారత టాప్ మూడు బ్యాటర్లు అందరూ అర్థశతకాలు సాధించారు. సంజూ శాంసన్ (Sanju Samson) 89, అభిషేక్ 52, ఇషాన్ కిషన్ 54 పరుగులతో అదరగొట్టారు. ఇది కూడా ఒక రికార్డ్‌గా నిలిచింది. ఇరవై ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఒకే జట్టు టాప్ మూడు బ్యాటర్లు ముగ్గురూ 50కు పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>