Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసియా అథ్లెటిక్స్ లో భారత్ హవా: 19 మెడల్స్ తో రికార్డ్!

కలం, స్పోర్ట్స్ : భారత యువ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ జెండాను రెపరెపలాడించారు. ఆసియా u20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ (U20 Athletics Championship) లో మన యువ కిరణాలు ఏకంగా 19 పతకాలతో చరిత్ర సృష్టించారు. ఇందులో 10 బంగారు పతకాలు ఉండటం విశేషం. ఈ అద్భుతమైన ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన యువ అథ్లెట్ల పట్టుదల, ప్రతిభకు ఈ విజయమే నిదర్శనమని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మరెంతో మంది యువతీ యువకులకు క్రీడల్లో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం మొదటి నుండి ఎంతో ఉత్సాహంగా సాగింది.

ముఖ్యంగా ముగింపు రోజున మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. మొదటగా మహిళల 5000 మీటర్ల పరుగు పందెంలో ముస్కాన్ బంగారు పతకంతో భారత్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత పురుషుల డిస్కస్ త్రో పోటీలో నిశ్చయ్ జాతీయ యూ20 రికార్డును తిరగరాస్తూ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే ఊపుతో పురుషుల 800 మీటర్ల పరుగులో మొగలి వెంకట్రామ్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక మహిళల 4×100 మీటర్ల రిలే రేసులో కాజల్ హీరాభాయ్ వాజా, భావన, ఆర్తి, నిపామ్‌లతో కూడిన బృందం రజత పతకాన్ని గెలుచుకుంది.

చివరి రోజు అసలైన మలుపు రిలే రేసుల్లో కనిపించింది. పురుషుల 4×400 మీటర్ల రిలేలో పీయూష్ రాజ్, సయ్యద్ సబీర్, రంజిత్ కుమార్, మహమ్మద్ అష్ఫాక్ లతో కూడిన భారత జట్టు పాత రికార్డును అధిగమించినప్పటికీ, మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. అయితే మహిళల 4×400 మీటర్ల రిలేలో మాత్రం భూమిక సంజయ్ నెహాతే, తహూరా ఖాతూన్, సెహ్నూర్ బావా, నీరు పాఠక్‌ల బృందం సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో జపాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించారు.

ఇలా ఆఖరి రోజు సాధించిన మూడు స్వర్ణాలతో కలిపి భారత్ మొత్తం 10 బంగారం, 5 వెండి, 4 కాంస్య పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత 2024 దుబాయ్ టోర్నీలో సాధించిన 29 పతకాల రికార్డుతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ, మన యువ అథ్లెట్లు కనబరిచిన పోరాట పటిమను క్రీడా నిపుణులు అభినందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>