కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ఇండియా కూటమి (INDIA Bloc) హైదరాబాద్‌లో ఆందోళనకు సిద్ధమైంది. అక్టోబర్ 8న ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం నిర్వహించి, లోక్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి (టీజేఎస్), బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు ర్యాలీలో పాల్గొననున్నట్లు సమాచారం. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం వైపు నుంచి భిన్నమైన వివరణలు ఉండగా, ప్రతిపక్షాలు మాత్రం ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల జాబితాలో పారదర్శకత కోసం ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అక్టోబర్ 6న హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఇండియా కూటమి నేతలు నిరసన చేపట్టారు. తాజాగా లోక్‌భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో నగరంలో భారీ ర్యాలీపై ఆసక్తి నెలకొంది.

