Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్‌కు మరో ఘోర ఓటమి.. చీల్చి చెండాడిన ఐర్లాండ్

కలం, స్పోర్ట్స్ : ఐర్లాండ్ అద్భుతం చేసింది. టీ20 సిరీస్ లో  భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచు (IND vs IRE) లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరూ విఫలమయ్యారు. సంజూ, అభిషేక్ ఇద్దరూ కూడా గోల్డెన్ డక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్, శ్రేయస్ కూడా ఆశించిన స్థాయిలో కాదు కదా.. కనీసం చెప్పుకోదగ్గ రేంజ్‌లో కూడా రాణించలేకపోయారు. తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఐర్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌ (IND vs IRE) లో కూడా జై ముంద్రా అదరగొట్టాడు. మూడు వికెట్లు పడగొట్టి ఇండియా బ్యాటర్స్‌కు చుక్కలు చూపించాడు. మాట్ హోలాండ్ కూడా తనదైన బౌలింగ్‌తో భారత బ్యాటర్ల చేత మూడు చెరువుల నీరు తాపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేయగలిగింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ ఓపెనర్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. టిమ్ టెక్టర్ 6 బంతుల్లో ఒక ఫోర్‌తో 5 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెనర్ రాస్ అడైర్ 7 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి వేగంగా ఆడే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ చేతికి చిక్కాడు. వన్‌డౌన్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి 47 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

మిడిల్ ఆర్డర్‌లో బెన్ కాలీట్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి వేగంగా స్కోరు పెంచాడు. అయితే శివమ్ దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అతను అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే గారెత్ డెలానీ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో జార్జ్ డాక్రెల్ 14 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. లియామ్ మెక్‌కార్తీ 4 బంతుల్లో 2 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, జై మూంద్రా ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ జట్టుకు ఎక్స్‌ట్రాల రూపంలో 6 పరుగులు లభించాయి.

భారత బౌలింగ్‌ను పరిశీలిస్తే, ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకోగా, శివమ్ దూబే 3 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సూర్యాంశ్ షెగ్డే 2 ఓవర్లలో 25 పరుగులు, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చినా వీరికి వికెట్లు దక్కలేదు.

లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు సంజు శాంసన్ (1 బంతి, 0), అభిషేక్ శర్మ (1 బంతి, 0) ఖాతా తెరవకుండానే జై మూంద్రా బౌలింగ్‌లో అవుటయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి జై మూంద్రా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 11 బంతుల్లో ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన పోరాటం చేస్తూ 46 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ 18 బంతుల్లో 14 పరుగులు చేసి మ్యాట్ హాలార్డ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

శివమ్ దూబే 16 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసి మాథ్యూ హంఫ్రీస్ బౌలింగ్‌లో అవుట్ కాగా, సూర్యాంశ్ షెగ్డే 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి వెనుతిరిగాడు. చివర్లో హర్షిత్ రాణా 10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేసి ఆశలు రేపినా చివరి ఓవర్లలో అవుటయ్యాడు. చివరి బంతికి విజయం కోసం భారీ షాట్ అవసరమైన సమయంలో అర్ష్‌దీప్ సింగ్ (4 నాటౌట్), ప్రిన్స్ యాదవ్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నప్పటికీ భారత్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. భారత్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో 10 పరుగులు వచ్చాయి.

ఐర్లాండ్ బౌలర్లలో జై మూంద్రా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మ్యాట్ హాలార్డ్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లతో రాణించాడు. మాథ్యూ హంఫ్రీస్ 4 ఓవర్లలో 28 పరుగులకు ఒక వికెట్, హ్యారీ టెక్టర్ 4 ఓవర్లలో 40 పరుగులకు ఒక వికెట్ సాధించారు. లీమ్ మెక్‌కార్తీ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చినా వికెట్ దక్కలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>