కలం, స్పోర్ట్స్ బ్యూరో: అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్‌కు (IND vs AFG T20 Series) టీమిండియాకు భారీ బూస్ట్. స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయాల నుంచి కోలుకుంటున్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్లో ప్రస్తుతం వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్‌తో సరైన మార్గంలో ఉన్నట్లు సమాచారం. మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా అవసరమైన క్లియరెన్స్ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో జరిగే మూడు టీ20ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ఖరారు చేయనుంది.
బుమ్రాకు రెస్టేనా..?
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీ–ఎంట్రీపై మేనేజ్మెంట్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. అతని వర్క్లోడ్ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నది. ప్రస్తుతానికైతే అఫ్గాన్ సిరీస్‌కు బుమ్రా లభ్యత సందేహాస్పదంగానే ఉన్నప్పటికీ.. ఆసియా క్రీడల సమయానికి అతను పూర్తిగా సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తున్నది.
ఐదేళ్ల తర్వాత కృనాల్ రీఎంట్రీ?
ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సీనియర్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 14 వికెట్లతో అదరగొట్టిన కృనాల్ ను జట్టులోకి తిరిగి తీసుకోవడంపై సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సరైన ఎడమచేతి వాటం స్పిన్నర్ కోసం వెతుకుతున్న మేనేజ్‌మెంట్, కృనాల్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కృనాల్.. 2021లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.

