కలం, నేషనల్ డెస్క్: ఢిల్లీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Delhi SIR) ప్రక్రియ తర్వాత ప్రతి ముగ్గురు ఓటర్లలో దాదాపు ఒకరి పేరు ముసాయిదా జాబితాలో కనిపించలేదు. సర్‌కు ముందు ఢిల్లీలో 1,45,10,299 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో 97.51 లక్షల మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో సుమారు 47.58 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలో నమోదైన మొత్తం ఓటర్లలో సుమారు 32.8 శాతం మంది పేర్లు ప్రస్తుతం ముసాయిదా జాబితాలో లేవు. వీరి పేర్లను ‘అన్‌కలెక్టబుల్’ లేదా ఏఎస్‌డీడీఓ కేటగిరీలో ఉంచారు. గైర్హాజరైన, ప్రాంతం మారిన, మరణించిన, డూప్లికేట్ లేదా ఇతర కారణాలతో గుర్తించిన ఓటర్లను ఈ కేటగిరీలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.
ముసాయితా జాబితా ఫైనల్ కాదు
సర్ ప్రక్రియలో సుమారు 97.51 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి డిజిటలైజేషన్ చేశారు. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 67.18 శాతం. మిగిలిన ఓటర్లకు సంబంధించిన పేర్లు ప్రస్తుతం ముసాయిదా జాబితాలో కనిపించకపోవడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముసాయిదా జాబితాలో పేరు లేకపోవడం శాశ్వతంగా ఓటు హక్కు కోల్పోయినట్లు కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 30 వరకు క్లెయిమ్ లకు అవకాశం
పేరు కనిపించని ఓటర్లు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు. అవసరమైన పత్రాలు సమర్పించి తమ పేర్లను తిరిగి చేర్చాలని కోరే అవకాశం ఉంది. ఓటర్లు తమ ఎపిక్ నంబర్, మొబైల్ నంబర్ , లేకుంటే ఇతర వ్యక్తిగత వివరాలతో ఆన్‌లైన్‌లో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్, ఎన్నికల సంఘం ఓటర్ సేవల పోర్టల్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.ఇక నియోజకవర్గాల వారీగా ఫారాల డిజిటైజేషన్‌లోనూ భారీ వ్యత్యాసం కనిపించింది. రోహిణిలో అత్యధికంగా 83.43 శాతం ఫారాలు డిజిటైజ్ కాగా.. తుగ్లకాబాద్‌లో అత్యల్పంగా 52.15 శాతం నమోదైంది.
పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
సర్ ప్రక్రియ అనంతరం ఢిల్లీలో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరిగింది. గతంలో 13,033గా ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు 14,947కు చేరాయి. పోలింగ్ స్టేషన్ ప్రాంతాల సంఖ్య 2,696 నుంచి 2,856కు పెరిగింది. ప్రస్తుతం విడుదలైంది ముసాయిదా ఓటర్ల జాబితా మాత్రమే. సెప్టెంబర్ 30 వరకు వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించి, క్షేత్రస్థాయి ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత నవంబర్ 4న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

