కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొండలు, గుట్టలు, చెరువులను లక్ష్యంగా చేసుకున్న మట్టి మాఫియా రాత్రింబవళ్లు భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ అండదండలు, అధికారుల సహకారంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని పెద్ద చెరువు నుంచి కొంతకాలంగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎస్సార్ఎస్పీ శాఖ అనుమతుల పేరుతో కొందరు మధ్యవర్తులు, ప్రైవేట్ వ్యక్తులు వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా ఇద్దరు వ్యక్తులకు తలా వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే కేటాయించినప్పటికీ, ఆ పరిమితి ముగిసిన తర్వాత కూడా రాత్రి వేళల్లో మట్టి తరలింపులు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పగటి వేళల్లో మాత్రమే తరలించాల్సిన మట్టిని రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
అనుమతులు వందల టన్నులకు.. తరలింపు వేల టన్నుల్లో!
రైతులు పొలాలను మెరక చేసుకునేందుకు పేరుతో స్వల్ప పరిమాణంలో అనుమతులు తీసుకుని, ఆ తర్వాత వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసినా తవ్వకాలు కొనసాగిస్తూ నల్లమట్టి, మొరం, గ్రావెల్‌ను రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలు, రహదారి నిర్మాణాలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో లారీ మట్టిని దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలను ఎగ్గొట్టి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో విస్తరించిన దందా
కేవలం కేశవపట్నం మాత్రమే కాకుండా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా అక్రమ మట్టి తవ్వకాలు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అనుమతులకు మించి జీరో పాయింట్ దాటి తవ్వకాలు జరగడంతో చెరువుల ఉనికి ప్రమాదంలో పడుతోందని, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ టిప్పర్ల రాకపోకలతో గ్రామీణ రహదారులు ధ్వంసమవుతున్నాయని, ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల మేర ఆదాయ నష్టం వాటిల్లుతున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. శంకరపట్నానికి చెందిన బ్రాహ్మణపల్లి యుగేందర్ మాట్లాడుతూ కేశవపట్నం పెద్ద చెరువు నుంచి జరుగుతున్న అక్రమ మట్టి తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ఎస్సార్ఎస్పీ ఏఈ తిరుపతిరావు మాట్లాడుతూ.. తాను కొత్తగా విధుల్లో చేరానని, అనుమతులకు మించి మట్టి తరలింపు జరుగుతున్న విషయం ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు మట్టి తరలింపును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అక్రమ తవ్వకాలు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక ప్రభావశీలుల అండదండల కారణంగానే మట్టి మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోతోందని స్థానికులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

