కలం, మెదక్ బ్యూరో: భవిష్యత్ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిచ్చేందుకు భారతదేశపు తొలి ఇన్ఫర్మేషన్ ఏజ్ మ్యూజియం (IAM) (Information Age Museum) ను సంగారెడ్డి లోని ఐఐటీ హైదరాబాద్‌లో క్యాంపస్ లో శ్రీకారం చుట్టారు. భారతీయ సాంకేతిక విద్యాసంస్థ హైదరాబాద్ (IITH), ఫోర్టెస్ (FORTESS – Forum of Erstwhile TCS Leaders and Leading IT Advisors) భాగస్వామ్యంతో ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో IAM IGNITE (ఇన్ఫర్మేషన్ ఏజ్ మ్యూజియం – IGNITE) పేరుతో మ్యూజియంకు ఏర్పాటుకు భూమిపూజ చేశారు.
దేశంలోనే ప్రత్యేకమైన ఈ మొదటి మ్యూజియం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో నిర్మించబడుతోంది. ఈ మ్యూజియంలో సమాచార యుగంలో ప్రపంచాన్ని మార్చిన ఆలోచనలు, సాంకేతికతలు, ఆవిష్కకరణలు, సాంకేతిక పురోగతులను ప్రదర్శించనున్నారు. ఈ మ్యూజియంలో పారిశ్రామిక విప్లవం నుంచి నేటి కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ పరివర్తన, రోబోటిక్స్, అధునాతన తయారీ మరియు ఎంట్రప్యూనర్ షిప్ వరకు సాంకేతిక పరిణామ క్రమాన్ని ప్రత్యక్షంగా చూసేలా రూపొందిస్తున్నారు.
IAM IGNITE మ్యూజియం ద్వార విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలకు క్లిష్టమైన సాంకేతిక అంశాలను సులభంగా అర్థమయ్యేలా, ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా పరిచయం చేయనుంది. ఈ మ్యూజియాన్ని 2026 డిసెంబర్ నాటికి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఇన్ఫర్మేషన్ ఏజ్ మ్యూజియంల జాతీయ నెట్‌వర్క్‌లో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారనుంది. తొలి ఇన్ఫర్మేషన్ ఏజ్ మ్యూజియం భూమి పూజా కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, ఫోర్టెస్ ఉపాధ్యక్షుడు ఎస్. మహాలింగం, IAM క్యూరేటర్, విజువల్ క్వెస్ట్‌కు చెందిన బిరాద్ యాజ్నిక్ పాల్గొన్నారు.

