కలం, వరంగల్ బ్యూరో: ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించే ప్రభుత్వ యంత్రాంగం.. తన పరిధిలోని ప్రభుత్వ ఆస్తులకు పన్నులు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. వరంగల్ ( Warangal ) సిటీలోని కాశిబుగ్గ మున్సిపల్ సర్కిల్ ఆస్తిపన్ను రికార్డులు చూస్తే ఇదే కనిపిస్తున్నది. నగరంలోని 32 ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు చెందిన ఆస్తులపై ఏకంగా రూ.15,96,52,336 పన్ను బకాయి ఉన్నట్లు అధికారిక నివేదికలో వెల్లడి కావడం చర్చనీయాంశంగా మారింది.
డీఎంహెచ్వో బకాయే రూ.2.42 కోట్లు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం (డీఎంహెచ్వో) అత్యధికంగా రూ.2.42 కోట్ల పన్ను బకాయితో తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత ప్రిన్సిపల్‌సీఎంఆర్‌కాలేజీ రూ.1.83 కోట్లకుపైగా బకాయితో రెండో స్థానంలో ఉంది. కాకతీయ మెడికల్‌కాలేజీ రూ.68.81 లక్షలు, లేబర్‌వెల్ఫేర్‌ఆఫీసు రూ.59.67 లక్షలు, ప్రభుత్వ జూనియర్‌కాలేజీ రూ.56.79 లక్షలు, మామునూరు వెటర్నరీ సైన్స్‌కాలేజీ రూ.38.24 లక్షలు, ఎంజీఎం ఆస్పత్రి రూ.28.87 లక్షలు, సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయం రూ.10.90 లక్షల మేర ఆస్తిపన్ను బకాయి ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇలా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య సంస్థల ఆస్తులపైనే లక్షలు, కోట్ల రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోవడం గమనార్హం.
పన్నెంత.. పెనాల్టీ ఎంత?
ఆస్తిపన్ను రికార్డుల్లో ఇయర్లీ ట్యాక్స్, ఎరియర్స్, ఎరియర్స్‌పెనాల్టీ, కరెంట్‌ట్యాక్స్, గార్బేజ్‌డ్యూ తదితర అంశాలను వేర్వేరుగా నమోదు చేశారు. దీంతో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత బకాయిలపై పెనాల్టీలు కూడా కలుస్తూ మొత్తం బకాయి మొత్తం పెరిగినట్లు తెలుస్తున్నది. అయితే అధికారిక రికార్డుల్లో చూపిన రూ.15.96 కోట్లలో అసలు ఆస్తిపన్ను ఎంత? పెనాల్టీ రూపంలో ఎంత మొత్తం ఉంది? ఎన్ని ఏళ్లుగా ఈ బకాయిలు పేరుకుపోయాయి? ఇప్పటివరకు ఎంత వసూలైంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అధికారుల తీరుపై ప్రశ్నలు
ప్రైవేట్‌భవనాలు, వ్యాపార సంస్థలు ఆస్తిపన్ను చెల్లించకపోతే నోటీసులు జారీ చేసి, పెనాల్టీలు విధిస్తూ ఇతర చర్యలు తీసుకునే అధికారులు.. ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తులపై కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయినా అదే స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు మున్సిపల్‌ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటికే వసూలు కావాల్సిన కోట్లాది రూపాయల ఆస్తిపన్ను ప్రభుత్వ శాఖల నుంచే వసూలు కాకపోవడం ఇందుకు భిన్నమైన పరిస్థితిని తలపిస్తున్నది.
వసూలైతే నగరాభివృద్ధికి ఊతం
మున్సిపాలిటీకి ఆస్తిపన్ను ప్రధాన ఆదాయ వనరు. అలాంటిది ప్రభుత్వ సంస్థల నుంచే రూ.15.96 కోట్ల ఆస్తిపన్ను బకాయి ఉండటం అధికారుల వసూళ్ల తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. ఈ బకాయిలు వసూలైతే పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన ఈ కోట్లాది రూపాయలను మున్సిపల్ అధికారులు ఎప్పటిలోగా రాబడతారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

