కలం, భద్రాచలం : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) లో గణేష్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. గోదావరి ఘాట్ వద్ద నిమజ్జనం కోసం విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు రాజధాని హైదరాబాద్ నుంచి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఒక భారీ గణనాథుని విగ్రహాన్ని భద్రాచలానికి తీసుకువచ్చారు. అయితే, గోదావరి ఘాట్ సమీపంలో విగ్రహాన్ని తీసుకెళ్తున్న ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వాహనంలో ఉన్న భారీ వినాయక విగ్రహం జారి కిందపడిపోయింది.
తొమ్మిది రోజులుగా ఎంతో నిష్ఠతో పూజించి, శోభాయాత్రగా తీసుకొచ్చిన స్వామివారి విగ్రహం తమ కళ్లముందే కిందపడటంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉత్సవ శోభతో విలసిల్లాల్సిన ఘాట్ ప్రాంతంలో ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విగ్రహాన్ని సురక్షితంగా పక్కకు తొలగించి, తదుపరి చర్యలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

