కలం, స్పోర్ట్స్ : మహిళా క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ (Women T20 World Cup 2026) మెగా సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 12 నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్) వేదికగా ఈ టోర్నీ గ్రాండ్‌గా మొదలుకాబోతోంది. మొత్తం 33 మ్యాచ్‌లతో సాగే ఈ 10వ ఎడిషన్ కోసం ఐసీసీ కేవలం మహిళలతోనే కూడిన మ్యాచ్ అఫీషియల్స్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే, గాయత్రి వేణుగోపాలన్, కాండీస్ లా బోర్డ్, కెరిన్ క్లాస్టే, షతీరా జాకిర్ జేసీ అనే నలుగురు ప్రతిభావంతులైన మహిళా అంపైర్లు ఈ మెగా టోర్నీ ద్వారా తమ తొలి టీ20 వరల్డ్ కప్ అరంగేట్రం చేయబోతున్నారు.
గత ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపడం వల్లే ఈ నలుగురిని ఐసీసీ ఎంపిక చేసింది. వీరితో పాటు మొత్తం 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రెఫరీలు ఈ టోర్నీని నడిపించనున్నారు. ఈ ప్యానెల్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా సీనియర్ అంపైర్ క్లైర్ పొలోసాక్‌తో పాటు ఐదోసారి విధులు నిర్వర్తించబోతున్న జాక్వెలిన్ విలియమ్స్, కిమ్ కాటన్‌లు ఉన్నారు. ఇక మ్యాచ్ రెఫరీలుగా భారత సంతతికి చెందిన జీఎస్ లక్ష్మి, షాండ్రే ఫ్రిట్జ్, మిచెల్ పెరీరా, ట్రూడీ ఆండర్సన్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు.
క్రీడల్లోని అన్ని విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఐసీసీ కట్టుబడి ఉందని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా పేర్కొన్నారు. అధికారుల నిర్ణయాలు, వారి గత ప్రదర్శనను శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే ఈ ఎంపికలు జరిగాయని చెప్పారు. ఈ ఎంపిక ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా క్రీడా ఈవెంట్ స్థాయిని మరింత పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో మహిళల అత్యున్నత ప్రతిభకు, సమానత్వానికి ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ ఒక ఆదర్శవంతమైన వేదికగా నిలవబోతోంది.

