కలం, వెబ్ డెస్క్: టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) జరుగుతున్న సమయంలో మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దృష్టి పెట్టింది. టోర్నమెంట్ ముగిసే వరకు అందరి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్, శ్రీలంకలో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ మార్చి 8న ముగియనుంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితులు మ్యాచ్‌లపై నేరుగా ప్రభావం చూపడం లేదు. కానీ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలామంది తిరుగు ప్రయాణంలో గల్ఫ్ దేశాల విమానాశ్రయాలను ట్రాన్సిట్‌గా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్ (Dubai) వంటి కేంద్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఈ కారణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణం, భద్రత అంశాలపై ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. అవసరమైతే యూరప్, దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియా మార్గాలు ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సహాయం కోసం ప్రత్యేక ట్రావెల్ సపోర్ట్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితులపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అవసరమైన సూచనలు వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. టోర్నమెంట్ (T20 World Cup) సురక్షితంగా ముగియడానికి అన్ని చర్యలు కొనసాగుతున్నాయని ఐసీసీ తెలిపింది.
Read Also: పేదల ఇండ్లు కూల్చి ఏం సాధిస్తారు : రామచందర్ రావు
Follow Us On: Pinterest

