కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వెటర్నరీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యుడిగా అనుమానిస్తూ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌ను (Gyanendra Kumar Gangwar) అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారికంగా ప్రకటించింది. మూడు రోజులుగా ఆయన్ను విచారిస్తూ వస్తున్న సీఐడీ అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు జ్ఞానేంద్ర కుమార్ సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేశారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన పాత్రపై మరింత లోతుగా విచారించేందుకు అరెస్ట్ తప్పలేదని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిర్వహించిన పలు పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెటర్నరీ పరీక్షల్లో అనర్హులకు ఉద్యోగాలిచ్చారంటూ అభ్యర్థులు ఆరోపించడంతో సీఎం డీకే శివకుమార్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ పరీక్ష జరిగిన సమయంలో కమిషన్ కార్యదర్శిగా జ్ఞానేంద్ర కుమార్ వ్యవహరించడంతో ఆయనపై సీఐడీ గురి పెట్టింది. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన జ్ఞానేంద్ర కుమార్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలోని MSME విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను వరుసగా మూడు రోజులు ప్రశ్నించి.. చివరికి అరెస్ట్ చేసింది. జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నామని సీఐడీ అధికారులు తెలిపారు.

