కరీంనగర్‌లో అత్యుత్తమ గ్రౌండ్.. అంబటి రాయుడు పర్యటన

కలం, ​కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా అలుగునూరులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్‌ (Karimnagar Cricket Ground)ను భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పరిశీలించారు. గ్రౌండ్‌తో పాటు పిచ్ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, రాష్ట్రంలోనే ఇది అత్యుత్తమ గ్రౌండ్‌లలో ఒకటిగా నిలుస్తుందని HCA యంత్రాంగాన్ని అభినందించారు. ​

క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలంలో జిల్లాల నుంచి కనీసం ఐదుగురు ఆటగాళ్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మన స్థానిక ఆటగాళ్లలో అద్భుతమైన నైపుణ్యం ఉందని, కొద్దిగా ప్రోత్సాహం, సరైన శిక్షణ అందిస్తే కచ్చితంగా భారత్ తరఫున ఆడే సత్తా వారికి ఉందన్నారు.

​క్రికెట్ ఒక మైండ్ గేమ్:

క్రీడాకారులకు పలు కీలక సూచనలు చేస్తూ… “ప్రతి క్రికెటర్ కేవలం శరీరంతో మాత్రమే కాకుండా మనసు పెట్టి ఆడాలి. క్రికెట్ అనేది శారీరక శ్రమతో కూడుకున్నది మాత్రమే కాదు, అది ఒక మైండ్ గేమ్” అని రాయుడు స్పష్టం చేశారు.

​పారదర్శకతకు ప్రాధాన్యం:

గతంలో HCA నిర్వహించిన ఆటగాళ్ల ఎంపికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా సరిదిద్దుతామని, భవిష్యత్తులో సెలెక్షన్ ప్రాసెస్ అంతా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

​ప్రభుత్వాలు సహకరించాలి:

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రికెట్ అసోసియేషన్ల అభివృద్ధికి చొరవ చూపాలని అంబటి రాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో కనీసం 10 ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాంగణాల కోసం కేటాయించి, ఆధునిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో HCA ప్రతినిధులు, స్థానిక క్రికెట్ కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>