కలం, వెబ్ డెస్క్: వర్షా కాలం నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో గాలివానల వల్ల విరిగిపడుతున్న చెట్లను, నిలుస్తున్న నీటిని తక్షణమే తొలగించేందుకు ‘హైడ్రా’ (HYDRAA) ప్రత్యేకంగా బైక్ టీమ్‌లను రంగంలోకి దించింది. భారీ డీఆర్ఎఫ్ (DRF) వాహనాలు వెళ్లలేని ఇరుకైన ప్రాంతాలు, తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఉన్న చోట్లకూ ఈ బైక్ బృందాలు సులువుగా చేరుకుంటాయి. గతేడాది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టును ప్రస్తుతం మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం 20 బైకులను అందుబాటులో ఉంచారు. వీటిపై ప్రయాణించే 60 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు నగరవాసులకు అత్యవసర సేవలు అందిస్తూ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’గా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ బైకులకు ప్రత్యేకంగా అమర్చిన బాక్సులలో బ్యాటరీతో నడిచే రెండు రంపాలు, బలమైన తాడు, గడ్డపారలు వంటి మల్టీ టాస్కింగ్ పరికరాలను ఉంచుతారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఫుట్‌పాత్‌ల పైనుంచి లేదా కాలినడకన ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్లను కోసి పక్కకు లాగేస్తారు. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలవకుండా డ్రైనేజీలను క్లియర్ చేస్తారు. ఇటీవల బంజారాహిల్స్, నిమ్స్ ఆసుపత్రి భవనంపై చెట్లు కూలినప్పుడు డీఆర్ఎఫ్ ట్రక్కులు వచ్చేలోపే ఈ బైక్ బృందాలు కిటికీల ద్వారా లోపలికి వెళ్లి రంపాలతో కొమ్మలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించాయి. మాన్సూన్, స్టాటిక్ టీమ్‌లతో సమన్వయం చేసుకుంటూ నగరంలో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించడంలో ఈ బైక్ టీమ్‌లు ఇప్పుడు హైడ్రాకు కీలకంగా మారనున్నాయి.

