కలం, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని అలకనంద నది (Alakananda River) లో హైదరాబాద్ యువకుడు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ఎన్ఐటీలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఆనంద్ మోహన్ అనే యువకుడు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు అలకనంద నదీ తీరానికి వెళ్లాడు. నది ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం నుండి నదిలోకి దూకాడు.
ఎంతసేపటికీ ఆనంద్ మోహన్ బయటికి రాకపోవడంతో స్నేహితులు భయంతో పోలీసులు, కాలేజ్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కాలేజ్ యాజమాన్యం ఆనంద్ మోహన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ నది ప్రవాహం ఎక్కువగా ఉండడం, అప్పటికే చీకటి పడడంతో ఎంత సేపు గాలించినా యువకుడి ఆచూకీ లభించేలేదని తెలిపారు. కుమారుడు నదిలో గల్లంతు అయిన వార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

