కలం, వెబ్ డెస్క్ : మూడేళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసు ఊహించని మలుపుతో బయటపడింది. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ (Bandlaguda Jagir) వినాయక నగర్ నివాసి యాదయ్య 2023 సెప్టెంబర్ 16న కుటుంబంలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి రూ.2,50,000 నగదు, 9 తులాల బంగారం, కొన్ని చీరలు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్కు యాదయ్య ఇంటి వెనుక నివాసముండే స్వప్న (29) అనే మహిళ ఒక చీర కట్టుకుని వచ్చింది. ఆ చీరను చూసిన యాదయ్య భార్య అది తమ ఇంట్లో దొంగిలించబడిన చీరేనని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు స్వప్న, ఆమె భర్త రాములు (35)లను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఆ చీర తనదేనని బుకాయించినప్పటికీ, పోలీసుల శైలి విచారణలో యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేశామని దంపతులు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండుకు తరలించారు.

