కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ ( IT Raids) దాడులు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ పన్ను ఎగవేత రాకెట్‌ను బయటపెట్టాయి. ఈ కుంభకోణం విలువ సుమారు రూ. 70,000 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షకుపైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అమ్మకాల గణాంకాలను తారుమారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వాస్తవ ఆదాయాన్ని తక్కువగా చూపినట్లు అధికారులు ఆరోపించారు. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖ జరిపిన లోతైన విచారణలో వెల్లడైంది.
ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే సుమారు రూ. 5,141 కోట్ల మేర అమ్మకాలను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కేవలం తెలంగాణలోనే సుమారు రూ. 1,500 కోట్ల ఎగవేత జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఏఐ (AI) డేటా అనాలిసిస్ ఉపయోగించి 60 టెరాబైట్ల డేటాను అధికారులు విశ్లేషించారు. నగదు రూపంలో జరిగిన లావాదేవీల బిల్లులను సాఫ్ట్‌వేర్ నుంచి తొలగించడం ద్వారా ఈ భారీ మోసానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ విచారణను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దేశవ్యాప్తం చేసింది.


