కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరం భానుడి భగభగలతో అల్లాడిపోతున్న వేళ అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నగర వాతావరణం నిప్పుల కొలిమి నుంచి మంచు కొండలా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో రికార్డు స్థాయి వేడిని చవిచూసిన దక్షిణ హైదరాబాద్ ప్రాంతం సాయంత్రానికి ఊహించని రీతిలో చల్లబడింది.
శంషాబాద్ నుంచి నాదర్‌గుల్ మధ్య ఉన్న రహదారులపై భారీ ఎత్తున వడగళ్ల వాన (Hyderabad hailstorm) కురిసింది. దీంతో కిలోమీటర్ల మేర రోడ్లన్నీ తెల్లటి మంచు పొరతో కప్పబడిపోయాయి. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న జనం ఒక్కసారిగా కురిసిన ఈ వడగళ్లను చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది వాహనదారులు తమ ప్రయాణాన్ని ఆపి రోడ్లపై పడిన మంచును చేతుల్లోకి తీసుకుని సంబరపడ్డారు. ఈ దృశ్యాలు చూస్తుంటే హైదరాబాద్ వీధులు హిమాలయాలను తలపిస్తున్నట్లు అనిపించాయి. సోషల్ మీడియాలో సైతం ఈ మంచు రహదారుల చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తీవ్రమైన వేడి గాలుల మధ్య ఇలాంటి వాతావరణం ఏర్పడటం అరుదైన విషయమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

