కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Lawrence) పోటీ చేయనున్నారా?.. విజయ్‌తో దీర్ఘకాలంగా ఉన్న స్నేహం, అనుబంధంతో ఈ అవకాశం లభించనున్నదా?.. తమిళ సినీ అభిమానులు సైతం లారెన్స్ పోటీని ఆహ్వానిస్తున్నారా?.. వీటన్నింటికీ ‘ఔను’ అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. స్వయంగా లారెన్స్ సైతం దీనిపై స్పందించారు.
ప్రస్తుతం ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 10న అది పూర్తవుతుందని, 11న ఉదయం 9.30 గంటలకు చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలను ఇస్తానని రాఘవ లారెన్స్ మీడియా ప్రతినిధులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా కూడా వెల్లడించారు. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఆ రోజున వెల్లడిస్తానని వివరించారు.
ఈ మేరకు ”చాలా మంది మీడియా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో వస్తున్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నేను స్పందించక తప్పదు. అందుకని సినిమా షూటింగ్ నుంచి రాగానే 11వ తేదీన పూర్తి క్లారిటీ ఇస్తాను ” అంటూ లారెన్స్ ట్వీట్‌లో రెస్పాండ్ అయ్యారు. దీంతో 11వ తేదీన ఆయన రాజకీయ ప్రవేశంతో పాటు తిరుచ్చి నుంచి పోటీ చేయడంపై క్లారిటీ రానున్నది.

