‘సర్’ డ్యూటీకి డుమ్మా.. విధుల నుంచి డిప్యూటీ కలెక్టర్‌ సస్పెన్షన్

కలం, తెలంగాణ బ్యూరో : ‘సర్’ (SIR) డ్యూటీకి డుమ్మా కొట్టి కారణాలేవీ చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ కలెక్టర్‌ను రెవెన్యూ సెక్రటరీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. హెచ్ఎండీఏలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.షర్మిల (Deputy Collector Sharmila) ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్డీవో పరిధిలో ‘సర్’ విధుల్లో నియమించింది ప్రభుత్వం. ఓటర్ల జాబితా సవరణతో పాటు బూత్ మ్యాపింగ్, బూత్ లెవెల్ ఆఫీసర్ల పర్యవేక్షణ తదితర బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆ జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నిర్దిష్టమైన డ్యూటీలను కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అప్పగించారు. కానీ ఆ బాధ్యతలు చేపట్టకుండా, తగిన కారణాలు తెలియజేయకుండా విధులకు డుమ్మా కొట్టారు. ఈ కారణంగా జిల్లాల్లో ఆశించిన తీరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రోగ్రామ్ జరగలేదని సీఈఓ ఆఫీస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

హెచ్ఎండీఏ డిప్యూటీ కలెక్టర్‌గా (Deputy Collector Sharmila) డిప్యూటేషన్‌పై ‘సర్’ అవసరాల కోసం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు వెళ్ళాల్సిన షర్మిల సమాచారమే ఇవ్వకుండా గైర్హాజరు కావడాన్ని అటు సీఈఓ కార్యాలయం, ఈటు రెవెన్యూ డిపార్టుమెంటు సీరియస్‌గా తీసుకున్నది. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముందస్తు సమాచారం లేకుండా జిల్లాను విడిచి వెళ్ళొద్దని ఆదేశించారు. గతంలోనూ షర్మిలపై పలు రకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ నుంచి సీఎం ఆఫీస్ వరకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. డిపార్ట్‌మెంటల్ ఎంక్వయిరీ కూడా జరిగింది. హెచ్ఎండీఏలో అవినీతికి అలవాటుపడిన షర్మిల హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి సంసిద్ధంగా లేరని, అందువల్లనే ఉట్నూరు ఆర్డీవో బాధ్యతల్లోకి వెళ్ళేందుకు వెనకాడారన్న గుసగుసలు హెచ్ఎండీఏ సిబ్బంది నుంచే వినిపించాయి.

షర్మిల హోదా డిప్యూటీ కలెక్టర్ అయినా చాలా కాలంగా డిప్యుటేషన్‌పై హెచ్ఎండీఏలోనే కొనసాగుతున్నారని, అంతర్గత విచారణ తర్వాతనే ఆమెను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉట్నూర్ ఆర్డీఓగా, జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా పోస్టింగ్ ఇచ్చినా హెచ్ఎండీఏలో కుర్చీని మాత్రం వదల్లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను లైట్ తీసుకోవడమే కాకుండా బదిలీ ఉత్తర్వులను ధిక్కరించారు.

Read Also: WHO హెచ్చరికలు.. ఎబోలా వైరస్ కేసులపై కేంద్రం ప్రకటన

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>