అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు: బీర్ల ఐలయ్య

‎కలం, ఆలేరు : పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah ) స్పష్టం చేశారు. బుధవారం మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, మండలానికి చెందిన 416 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ‘చేయూత’ పెన్షన్ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మోటకొండూరు మండలంలో 416 మందికి పెన్షన్ పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ఆర్థిక సాయం వారి కుటుంబాలకు కొండంత భరోసానిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కల్పిస్తున్నామని, రైతు భరోసా పెట్టుబడి సాయం, రైతు రుణమాఫీ ద్వారా అన్నదాతలను రుణభారం నుంచి విముక్తి చేశామన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రోత్సాహం, ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు.
‎

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>