సైదాపూర్‌ లబ్ధిదారులకు సంక్షేమ కానుక

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ (Saidapur) మండలంలో అర్హులైన 642 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా పింఛన్లు పొందుతున్న 642 మంది లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హత ఉండి ఇంకా ఏడు రకాల పింఛన్లు పొందని వారు దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, రాష్ట్రవ్యాప్తంగా రూ.79 వేల కోట్ల రుణాలు అందించామని వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాలకు స్టీల్ కిట్లు అందిస్తున్నామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం నిర్వహించిన నిర్ధారణ శిబిరంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి బ్యాటరీ రిక్షాలు, చేతి కర్రలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలను ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకా అర్హులు నమోదు చేసుకోకపోతే ఈ నెల 25, 26 తేదీల్లో హుస్నాబాద్‌లో జరిగే శిబిరానికి రావాలని కోరారు.

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు చిన్న గ్రామాలకు రూ.లక్ష, పెద్ద గ్రామాలకు రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జనవరి 1లోపు ప్రతి గ్రామంలో రెండు కబడ్డీ, రెండు ఖో-ఖో, రెండు వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సర్పంచులను ఆదేశించారు. యువత కోసం ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. భూగర్భ జలాల పెంపు, కరువు నివారణకు జలసిరి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని, జీవనోపాధి కోసం పనిచేసే వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందని వివరించారు. జీవో నంబర్ 566 ప్రకారం పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు పింఛన్ బదిలీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్డీవో, డీపీవో, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>