డంపింగ్ యార్డ్ పై ప్రభుత్వ మొండి వైఖరి సరికాదు : గంగాడి కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం నేడు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మొండి వైఖరి ప్రదర్శిస్తూ ప్రజల ఉసురు పోసుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం రోజున కరీంనగర్ (Karimnagar)  కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

జెఏసి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు, హాని తలపెట్టే కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ ప్రాంతాన్ని నేడు అశాంతిగా మార్చారని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామనే ప్రకటన, నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు సృష్టించారని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వద్దని నెల రోజులుగా ప్రజలు ఆందోళలు నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉందన్నారు. ప్రజలంతా ఒక్కటై, అన్ని పార్టీలు ,అన్ని సంఘాలు ఒక్కటై జేఏసీగా ముక్తకంఠంతో నినదించిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మనసు మార్చాలని, ప్రజలంతా మూకుమ్మడిగా మల్లన్న దేవుని పట్నాలు వేసి దేవుణ్ణి వేడుకునే దయనీయ పరిస్థితుల్లో ప్రజానికం ఉండడం ఎంతో ఆవేదన కలిగిస్తుందన్నారు.

ప్రభుత్వానికి మొండి పట్టుదల మంచిది కాదని, ప్రజల ఉసురుపోసుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డంపింగ్ యార్డ్ రద్దు ప్రకటన చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, హుజురాబాద్ సత్తా చూపెడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. జెఎసి అఖిలపక్షం నాయకులు ఈశ్వర్ రెడ్డి రత్నం కొలిపాక సమ్మయ్య, తునికి సమ్మయ్య, ప్రభాకర్ రావు, జైపాల్ రెడ్డి, బిజెపి పట్టణ మండల అధ్యక్షులు తుర్పాటి రాజు, పారుపల్లి కొండాల్ రెడ్డి, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, నరాల రాజశకర్, కొలిపాక వెంకటేష్, చైతన్య రెడ్డి, దేవా గౌడ్ సహదేవ్, పున్నం చందర్, వాసల చిరంజీవి, వెంకట్రావు, ఇనుగాల తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, యాట రాజేష్ ఖన్నా, పురాణం శ్రీనివాస్, గండు కుమార్, తూర్పాటి రమేష్ వివిధ గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>