భార్య ఆత్మహత్య.. భర్త ఫోన్‌లో బయటపడ్డ సంచలన రహస్యాలు!

​కలం, కరీంనగర్: అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్య (Wife Suicide) కు కారణమైన భర్తను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి గురువారం ఈ కేసు వివరాలను వెల్లడించారు.

​అసలేం జరిగింది?

వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య తన కుమార్తె శ్రావంతిని సుమారు 11 ఏళ్ల క్రితం కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా, సంపత్ గత రెండేళ్లుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను వివాహం చేసుకోవాలంటే భార్యను వదిలించుకోవాలని సదరు మహిళ ఒత్తిడి చేయడంతో, సంపత్ కొంతకాలంగా శ్రావంతిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.

​వీడియో కాల్స్ చూసి నిలదీయడంతో..

ఈ నెల 9వ తేదీ రాత్రి సంపత్ తన మొబైల్ ఫోన్‌లో సదరు మహిళతో వీడియో కాల్స్, చాటింగ్ చేస్తుండగా శ్రావంతి గమనించి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన సంపత్.. తాను ఆ మహిళనే ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. అంతేకాకుండా “నువ్వు బతికితే బతుకు.. చస్తే చావు” అంటూ అత్యంత దురుసుగా ప్రవర్తించాడు. భర్త మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావంతి, తనతో పాటు ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన చెంది, మరుసటి రోజు ఉదయం పిల్లల బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

​ఆధారాలు చెరిపేసి నాటకం

ఉదయం 8 గంటల సమయంలో నిద్రలేచిన సంపత్, భార్య ఉరివేసుకోవడాన్ని గమనించాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వెంటనే తన ఫోన్‌లోని చాటింగ్స్, మెసేజ్‌లను డిలీట్ చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ బంధువులు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రావంతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

​పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

మృతురాలి తండ్రి ఇమ్మడి ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు, అప్పటి నుంచి పరారీలో ఉన్న సంపత్ కోసం గాలింపు చేపట్టారు. గురువారం బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలోని జైలు బంక్ వద్ద నిందితుడు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో సీఐ నిరంజన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు.​ పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా పరిశీలించగా, సిరికొండ మహిళతో జరిపిన చాటింగ్స్, వీడియో కాల్స్ వివరాలు బయటపడ్డాయి. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు, సదరు మహిళను కలుసుకోవడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>