కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కాకతీయుల కాలం నాటి చారిత్రక త్రికూటాలయం(Trikuta Temple) దశాబ్దాల నిరాదరణ నుంచి బయటపడుతోంది. సరైన నిర్వహణ లేక పూజలు నిలిచిపోయి ‘చీకటి గుడి’గా మారిన ఈ ప్రాచీన ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు స్థానికులు ఐక్యంగా ముందుకు వచ్చారు. నవంబర్ 7న చిన్నగుట్ట స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి 3వ గిరి ప్రదక్షిణ సందర్భంగా శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దానిని పునరుద్ధరించాలని సూచించారు. గురువు స్ఫూర్తితో దేవాలయ కమిటీ సభ్యులు తక్షణ చర్యలు చేపట్టారు.
జేసీబీ సహాయంతో ఆలయం చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. నిత్య దీపారాధనను సైతం ప్రారంభించారు. వచ్చే డిసెంబర్ 6న జరగనున్న 4వ గిరి ప్రదక్షిణలో భక్తులు ఈ త్రికూటాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాకతీయుల నాటి అపురూప వారసత్వాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ అధికారులు, పురావస్తు శాఖ, దాతలు సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండ గోపాల్ రెడ్డి, నరహరి నారాయణ రెడ్డి, పెద్ది కొమురయ్య, శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, ముత్యం గణపతి, బోగ సుదర్శన్, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “మా లక్ష్యం ఒక్కటే.. నిరాదరణకు గురైన కాకతీయుల నాటి చారిత్రక సంపదను కాపాడుకోవడం.. మన ఊరిలో మళ్లీ ఆధ్యాత్మిక వైభవాన్ని నిలపడం” అని తెలిపారు. “చరిత్రను కాపాడుకుందాం… ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరిద్దాం” అనే నినాదంతో కొత్తపల్లి యువత సాగిస్తున్న ఈ ప్రయాణం నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

