Mobile Popup Ad
Mobile Popup Ad

కొబ్బరికాయ కొట్టడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి?

కలం, వెబ్‌డెస్క్: మనం గుడికి వెళ్లినప్పుడే కాకుండా శుభకార్యాలు ప్రారంభించే ముందు కూడా కొబ్బరికాయ (Coconut) ను కొడుతుంటాం. శుభకార్యాలు ప్రారంభించే ముందు కొబ్బరి కాయను ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని గురించి ఆధ్యాత్మిక నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ విశ్వాసం (Hindu Belief) ప్రకారం.. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టడం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారం. కొత్త ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేసినప్పుడు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, కొత్త వాహనాన్ని కొన్నప్పుడు, పెళ్లిళ్లు వంటి శు‌భ కార్యాలలో కొబ్బరి కాయ కొట్టడం అనాధిగా వస్తున్న ఆచారం. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదని, దీని వెనుక ఆధ్యాత్మిక సందేశం కూడా ఉందని పురాణాలు వివరిస్తున్నాయి.

కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు

1. అహాన్ని వీడటం

కొబ్బరికాయ గట్టి పైచిప్ప అంటే కొబ్బరి పెంకు మనిషిలోని అహంకారం, గర్వం, స్వార్థానికి ప్రతీకగా భావిస్తారు. అయితే దేవుని ముందు కొబ్బరి కాయను కొట్టడం అంటే మన అహంకారాన్ని విడిచిపెట్టి, వినయంతో దైవాన్ని ఆశ్రయించడం. మనిషికి నిజమైన విజయం అనేది వినయంతోనే వస్తుంది అనే సందేశాన్ని ఈ ఆచారం తెలియజేస్తుందని చెబుతున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.

2. మనస్సును శుద్ధి చేయడం

కొబ్బరి పెంకును పగలగొట్టిన తర్వాత బయటికి వచ్చే నీటిని పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. దీనివల్ల మన మనసులోని ప్రతికూల భావాలు అయిన అసూయ, కోపం, చెడు ఆలోచనలను విడిచిపెట్టి, స్వచ్ఛమైన మనస్సుతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని సూచిస్తుంది.

3. స్వచ్ఛతను పంచడం

కొబ్బరికాయను చూసినట్లయితే.. బయట పెంకు గట్టిగా ఉంటుంది. కానీ లోపల మాత్రం తెల్లగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇదే విధంగా మనిషి బాహ్యంగా కఠినంగా కనిపిస్తాడు. అయినప్పటికీ అంతరంగంలో స్వచ్ఛత, దయ, ప్రేమ, నిజాయితీ వంటి లక్షణాలు ఉండాలని ఈ ఆచారం గుర్తు చేస్తుందంటున్నారు నిపుణులు. అంతే కాకుండా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరిని ప్రసాదంగా పంచుతాం. ఇలా పంచడం ద్వారా మంచితనం, ఆనందం, శాంతిని ఇతరులతో పంచుకోవాలనే సందేశం కూడా ఇస్తుందట.

హిందూమతంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యం

హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను ‘శ్రీఫలం’ అని పిలుస్తారట. ఇది శ్రేయస్సు, సంపద, పవిత్రత, దైవానుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం.. కొబ్బరికాయను త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా కూడా చెప్పబడిందట.

అంతే కాకుండా, శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమికి వచ్చినప్పుడు మానవుల శ్రేయస్సు కోసం కొబ్బరి చెట్టును, కామ ధేనువును కూడా తమతో పాటు తీసుకొచ్చాడని చెబుతారు. అందుకే కొబ్బరికాయలో విష్ణువు, లక్ష్మీల దైవిక కృప కూడా ఉంటుందని, కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఐశ్వర్యం, అదృష్టంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

ఈ ఆచారం ఎలా ప్రారంభమైంది?

పురాణాల్లో ఉన్న ఒక కథనం ప్రకారం.. సాధారణంగా యజ్ఞాలు, దేవాలయాల్లో జంతు బలులు ఇచ్చేవారు. అయితే ఒక రాజు యజ్ఞాలు, దేవాలయాల్లో అమాయక జంతువులను బలి ఇవ్వడం తనకు ఇష్టం లేదని మహర్షులను అడిగాడు. జంతు బలికి బదులుగా హింస లేని ప్రత్యామ్నాయం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు ఋషులు ఆ మహర్షికి కొబ్బరికాయను సమర్పించాలని సూచించారట. మనిషి/జీవి తలకు ప్రతీకగా భావించిన కొబ్బరికాయను దేవునికి సమర్పించడం ద్వారా అహంకారాన్ని విడిచి పెట్టినట్లుగా భావించారు. అప్పటి నుంచి యజ్ఞంలో జంతు బలులకు బదులుగా, సంపూర్ణ భక్తికి, పవిత్రమైన నూతన ప్రారంభానికి గుర్తుగా దేవాలయాల్లో, శుభకార్యాల్లో కొబ్బరికాయను కొట్టే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.

అయితే, పైన చెప్పుకున్న అర్థాలు ప్రధానంగా హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, పురాణాల్లో ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగా చెప్పబడినవి. అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి వివరణలు మారుతూ ఉంటాయి.

Read  Also: దాంపత్య జీవితంలో గొడవలు తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>