‘ఎల్ నినో’ మరింత తీవ్రతరం.. భారత్‌లో భారీ ప్రాణనష్టం?

కలం, నేషనల్ డెస్క్: ఎల్ నినో (El Nino) ఈ ఏడాది అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నది. పసిఫిక్ మహాసముద్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాబోయే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన హీట్వేవ్స్ కారణంగా 3.73 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. వేసవిలో సాధారణంగా సంభవించే మరణాలకు ఇవి అదనమని పేర్కొన్నది. ఈ విపత్తు ప్రభావం గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) పైనే ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా భారత్లో వచ్చే ఏడాది మార్చి నాటికి సుమారు 55 వేల మంది మృతి చెందవచ్చని ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ రూపొందించిన ‘ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ అంచనా వేసింది.

ఎన్నడూ లేనంత తీవ్రరూపం

సాధారణంగా 2 నుంచి 7 ఏళ్లకొకసారి వచ్చే ఈ వాతావరణ మార్పు.. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రరూపం దాల్చింది. కేంద్ర, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే రికార్డు స్థాయిలో 3.08 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఇదేనని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ధ్రువీకరించింది. దీనివల్ల సముద్రాల నుంచి భారీగా వేడి.. వాతావరణంలోకి విడుదలవుతూ భూగోళాన్ని మరింత వేడెక్కిస్తున్నది. దీని ప్రభావం రాబోయే డిసెంబర్లో గరిష్ట స్థాయికి చేరి, 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నది.

కోస్టల్ సిటీల్లో తీవ్ర కాలుష్యం

తీవ్రమైన వేడితో పాటు ఎల్ నినో ప్రభావం వల్ల ముంబై, ఇతర కోస్తా నగరాల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలుల వేగం తగ్గితే నగరాల్లోని కాలుష్య కారకాలు గాలిలో కలిసిపోయి దూరంగా వ్యాపించలేక, ఒకేచోట పేరుకుపోయే అవకాశం ఉన్నది. దీంతో వాయు కాలుష్యం మరింత తీవ్రమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఈ ముప్పును ముందుగానే గుర్తించి, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు తక్షణమే కార్యాచరణ ప్రణాళికలు (హీట్ యాక్షన్ ప్లాన్స్) రూపొందించి అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏ దేశంలో ఎన్ని మరణాలంటే?

ఎల్ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాణనష్టం జరిగే దేశాల్లో నైజీరియా (56,000 మరణాలు) మొదటి స్థానంలో ఉండగా, భారత్ (55,000 మరణాలు) రెండో స్థానంలో ఉన్నది. భారత్‌లో సంభవించే మరణాలలో అత్యధిక భాగం వచ్చే ఏడాది మార్చి నెలలోనే జరిగే అవకాశం ఉందని ‘ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ పేర్కొన్నది. వీటితో పాటు ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో 29,000 మంది, బ్రెజిల్లో 19,000 మంది ఈ వేడికి బలికావచ్చని అంచనా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>