రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భిన్నవాతావరణం కనబడుతోంది. ఓ వైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. అకాల వర్షాలతో చేతికొచ్చే పంట నష్టపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణివిస్తరించి ఉండటంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి వడగళ్ల వానలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3రోజులపాటు రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో పెద్దగా మార్పు ఉండదని వాతావరణశాఖ తెలిపింది.

విత్తు నాటిన మొదలు నుంచి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రైతులకు ప్రకృతి వికృత రూపం శాపంగా మారింది. కోతకు వచ్చి చేతికి అందుతాయనుకున్న సమయంలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. వరితోపాటు మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, కూరగాయల తోటలు కూడా దెబ్బతినడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. గత మూడేళ్లుగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరు బెల్టుపైనే ప్రకృతి పగబట్టినట్లుగా వానలు కురుస్తుండడంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. సాగు కోసం చేసిన అప్పులు, పెట్టుబడి ఖర్చులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వడగండ్ల వానకు భిక్కనూరు మండలంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రాథమికంగా 820 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా భిక్కనూరులో 250 ఎకరాలు, మల్లుపల్లిలో 150, లక్ష్మీదేవునిపల్లిలో 120, రామేశ్వర్ పల్లిలో 110 ఎకరాల తో పాటు కంచర్ల, పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల్లో పంటలు నేలపాలయ్యాయి.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో అకాల వ‌ర్షం రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మ‌డి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో బ‌ల‌మైన ఈదురు గాలులతోకూడిన వ‌ర్షం, కొన్ని ప్రాంతాల్లో వ‌డ‌గండ్ల వాన, మ‌రికొన్ని ప్రాంతాల్లో అకాల వ‌ర్షం రైతన్న‌ను కొలుకొని దెబ్బ‌తీసింది. సంగారెడ్డి‌ జిల్లాలో మామిడి తోట‌లకు, మెద‌క్, సిద్ధిపేట జిల్లాల్లో వరిపంటకు తీవ్ర న‌ష్టం జ‌రిగింది. ఈదురుగాలుల బీభత్సానికి, అకాల వర్షాలకు మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బ‌ల‌మైన ఈదుర‌గాలుల ప్ర‌భావంతో వేలాది ఎక‌రాల్లో మామిడి కాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, స‌దాశివ‌పేట‌, జ‌హీరాబాద్, కంది ప్రాంతాల్లో అకాల వర్షాలతో మామిడి పంట నేల రాలింది. బలమైన ఈదురుగాలుల వల్ల మామిడి తోటల్లోని పిందెలు, కాయలు నేల రాలాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మ‌లు నేలకొరిగి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌లో అమ్ముకొనే సమయంలో వచ్చిన వానలు తమని నిండా ముంచాయని మామిడి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>