ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలకళ.. అన్నదాతల్లో ఆనందం

కలం, కరీంనగర్ బ్యూరో: వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం (Heavy Rains) కురిసింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సారంగాపూర్ లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. బుగ్గారంలో 18, రాయికల్, వెలగటూర్ లో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో 14 సెంటీమీటర్లు రామగుండంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ఎల్లంపల్లికి వరద..

జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల, రామగుండంలో పలు కాలనీల్లో ఇళ్ళలోకి వరద నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయింది. గంగాధర, రామడుగు చొప్పదండి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం..

భారీ వర్షంతో (Heavy Rains) జగిత్యాల మండలం అనంతారం, ధర్మపురి మండలం అక్షయ పల్లి వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ఉండడంతో జగిత్యాల ధర్మపురి రూట్ లో రాకపోకలు నిలిచిపోయాయి.‌ రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కరువు తీరిపోయేంతగా వర్షం కురవటంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

రైతుల్లో చిగురించిన ఆశలు..

కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మోటార్లు బుధవారం ప్రారంభం కావడంతో కరీంనగర్ జిల్లా రైతుల్లో ఆశలు చిగురించాయి. రామడుగు వద్ద పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తుండటంతో కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ (Maneru Dam) కు జలకళ సంతరించుకుంది. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మోటార్లు ప్రారంభం కావడంతో గోదావరి జలాలు మానేరు డ్యామ్ వైపు తరలుతున్నాయి. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి అవసరాలకు భరోసా కలగడంతో పాటు ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు పెరిగాయి.

ఉధృతంగా ఆనంతారం వాగు..

జగిత్యాల రూరల్ మండలం ఆనంతారం వాగు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి మండలం నేరెళ్ల సమీపంలోని సాంబాశివుడి గుట్ట వద్ద వరద నీరు రోడ్డుపై నుంచి పారుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల – ధర్మారం మార్గంలోనూ రోడ్లపై వరద ప్రవహించడంతో ఆ మార్గంలో రవాణా నిలిచిపోయింది. జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్, జగిత్యాల మండల పరిషత్ ఎంపీఓ రవిబాబులు మకాం వేసి ఆనంతారం రోడ్డువైపు ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

గోదావరికి జలకళ..

జగిత్యాల నుండి ధర్మపురి మీదుగా మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. జగిత్యాల నుండీ సారంగాపూర్, బీరుపూర్ మండలాలకు వెళ్లేందుకు వాహనాదరులు ఇబ్బందులు పడ్డారు. ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. రాయపట్నం, కోటిలింగాల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా గోదావరి నీటికుండను తలపిస్తోంది. తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోవిందుపల్లెతోపాటు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>