కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ‘అర్నబ్’ (Cyclone Arnab) ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొచ్చి యానాం, నరసాపురం సమీపంలో తీరాన్ని దాటుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఈ తుఫాన్ దాటికి ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తీవ్ర ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి సాగే విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముందుజాగ్రత్త చర్యగా ఇండిగో సంస్థ నేడు విజయవాడ నుంచి నడిచే తన అన్ని విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. అలాగే ఫ్లై 91 సంస్థకు చెందిన హైదరాబాద్ విమాన సర్వీసుల రాకపోకలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత వాసులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను ఇప్పటికే రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.

