కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో 31 జిల్లాల్లో 365 మండలాలను కరువు (Telangana Drought) ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లోటు వర్షపాతం, పంట నష్టం, నేలలో తేమ శాతం, సాగునీటి లభ్యత, భూగర్భ జలాలు అడుగంటడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మండలాలను గుర్తించింది. మొత్తం కరువు మండలాల్లో 111 చోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నదని, మిగిలిన 254 మండలాల్లో సాధారణంగా ఉన్నట్లు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పంటల ఎదుగుదల మందగించడం, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడం, సాగునీటి కొరత వంటి అంశాలను ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించి.. తక్షణం సహాయక చర్యలను ప్రారంభించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు నెల రోజుల్లోపు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని స్పష్టం చేశారు. ఈ వారంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక సమర్పించనున్నది. డిప్యూటీ సీఎం అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో 365 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం గమనార్హం.
ఆ రెండు జిల్లాల్లో అత్యధికం
రాష్ట్రం మొత్తం మీద 365 కరువు మండలాను ప్రభుత్వం ప్రకటించగా.. అత్యధికంగా నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో 28 చొప్పున ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట (23), వికారాబాద్ (20), ఆదిలాబాద్ (20), నిజామాబాద్ (18), రంగారెడ్డి (18), భువనగిరి (17), ఖమ్మం (17), కొత్తగూడెం (16) ఉన్నాయి. నారాయణ్‌పేట జిల్లాలోని మొత్తం 13 మండలాలనూ, గద్వాల జిల్లాలోని మొత్తం 13 మండలాలనూ తీవ్రమైన కేటగిరీలో చేర్చారు. నల్లగొండలో 20 (మొత్తం 28), వికారాబాద్‌లో 11 (మొత్తం 20), నాగర్‌కర్నూల్‌లో 10 (మొత్తం 13), ఖమ్మంలో 10 (మొత్తం 17) చొప్పున ‘సివియర్’ కేటగిరీలో ఉన్నాయి. మొత్తం 31 జిల్లాల్లో కరువు నెలకొనగా హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం కరువు మండలాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ భాగం కరువుబారిన పడడంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే నివేదికకు అనుగుణంగా కేంద్ర బృందాలు పర్యటించి ఎలాంటి రిపోర్టును కేంద్ర హోశాఖకు సమర్పిస్తాయి? ఏ మేరకు ఆర్థిక సాయం అందుతుందన్నది? ఆసక్తికరంగా మారింది. నివేదిక సమర్పించిన వారం రోజుల్లో కేంద్ర బృందాలు పర్యటించాల్సి ఉంటుంది.
అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం
రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులపై అసెంబ్లీలో సెప్టెంబర్ 18న ప్రత్యేక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. అప్పటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల మేర కరువు సహాయ ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్), ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) విడుదల చేయాలని, ఎఫ్ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) కింద అదనపు రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని (స్టేట్ జీడీపీలో ప్రస్తుతం ఉన్న 3 శాతాన్ని 3.5 శాతానికి పెంచడం), ఎక్కువ ఎరువులను కేటాయించాలని, 1500 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను సమకూర్చాలని, జీ-రామ్-జీ స్కీమ్ కింద ఇప్పుడున్న 125 పనిదినాలకు అదనంగా మరో 50 రోజులను కేటాయించాలని, కేంద్ర సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రాయోజిత (సెంట్రల్లీ స్పాన్సర్డ్) పథకాల కింద అదనపు సాయాన్ని ఇవ్వాలని.. ఇలాంటి విజ్ఞప్తులు చేసింది. ఇప్పుడు కరువు మండలాల సంఖ్య పెరగడంతో పాటు తీవ్రత కూడా పెరిగినందున స్పెషల్ ప్యాకేజీ కింద కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడుగుతుందనేది కీలకం.
ఇతర మండలాల్లోనూ సహాయక చర్యలు
కరువు ప్రభావిత మండలాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. పశువులకు మేత, తాగునీటి కొరత ఏర్పడకుండా చూడాలని, కరువు పరిస్థితులపై సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో లేని మండలాల్లోనూ కరువు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే రానున్న రోజుల్లో అక్కడ కరువుకు అనుగుణంగా చేర్చొచ్చని కలెక్టర్లకు సూచించింది. రైతులకు అందించే పరిహారం, కరువు సహాయక చర్యలు, సాగునీటి సరఫరాపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.
జిల్లాల వారీగా కరువు మండలాలు
కరువు తీవ్రత ఎక్కువగా ఉన్న లిస్టు ప్రకారం.. ఉత్తర తెలంగాణ విషయానికొస్తే ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ అర్బన్, గాడిగూడ, నారనూర్, గుడిహత్నూర, ఆదిలాబాద్ రూరల్, మావలా, థాంసీ, బజార్ హత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, ఉట్నూర్, సోనాల, జైనథ్, బేల, సిరికొండ, సత్నాల, భోరజ్ మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్, సిర్పూర్ (యు), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాలు ఉండగా… మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, వేమనపల్లి, నెన్నల్, మందమర్రి, నస్పూర్, భీమారం, చెన్నూర్, కొత్తపల్లి మండలాలను చేర్చారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ అర్బన్, ఖానాపూర్, కుబీర్, భైంసా, కుంటాల, సోన్, లక్ష్మణ్‌చంద, కడ్డంపెద్దూర్, దస్తూరాబాద్ మండలాల పేర్లను చేర్చారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ అర్బన్, ఖానాపూర్, కుబీర్, భైంసా, కుంటాల, సోన్, లక్ష్మణ్‌చంద, కడ్డంపెద్దూర్, దస్తూరాబాద్ ఉన్నాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలో 18 మండలాలు (నిజామలాబాద్ సౌత్, నార్త్, రూరల్, నవీపేట్, నందిపేట్, ఆర్మూరు, ముప్కల్, మెండోరా, ఎర్గట్ల, వయిల్‌పూర్, మాక్లూర్, ముగ్పల్, ఇందల్వాయి, మోస్రా, చండూర్, ఆలూరు, వర్ని, పోతంగల్) ప్రభావితమవ్వగా, కామారెడ్డిలో జుక్కల్, పెద్ద కొడపగల్, సదాశివనగర్, మొహమ్మద్‌నగర్ మండలాలు ఉన్నాయి. కరీంనగర్‌లో కరీంనగర్, రూరల్, హుజూరాబాద్, జగిత్యాలలో జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి, ఇల్లందకుంట మండలాలు ఈ జాబితాలో చేరాయి.
తూర్పు, మధ్య తెలంగాణ ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రూరల్ సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కొణిజెర్ల, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూర్ కరువు బారిన పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, భద్రాచలం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం, బూర్గంపాడు, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 8 మండలాలు (దుగ్గొండి, నర్సంపేట్, చెన్నారావుపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, ఖిలా వరంగల్, వరంగల్), హనుమకొండ జిల్లాలో 14 మండలాలు (హనుమకొండ, కాజీపేట, హసన్‌పర్తి, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్, ఐనవోలు, దామెర, ఆత్మకూర్, శాయంపేట, పరకాల, భీమదేవరపల్లి, ధర్మసాగర్, నడికుడ), జనగాంలో 4 మండలాలు (రఘునాథపల్లి, తరిగొప్పుల, జఫర్‌గఢ్, పాలకుర్తి), భూపాలపల్లిలో 5 మండలాలు (మహదేవ్‌పూర్, ముత్తారం, కాటారం, మల్హర్‌రావ్, కొత్తపల్లి-గోరి), ములుగులో 4 మండలాలు (గోవిందరావ్‌పేట్, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట్) మరియు మహబూబాబాద్ జిల్లాలో 7 మండలాలు (డోర్నకల్, కురవి, గూడూర్, నెల్లికుదురు, సీరోల్, కొత్తగూడ, ఇనుగుర్తి) కరువు మండలాల జాబితాలోకి వచ్చాయి.
నల్లగొండ , యాదాద్రి పరిసర ప్రాంతాలలో నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, చండూర్, మర్రిగూడ, చింతలపల్లి, నాంపల్లి, నిడమనూరు, దామరచర్ల, అడవి దేవులపల్లి, తిరుమలగిరి (సాగర్), పెద్దవూర, గట్టుప్పల్, పెద్ద అడిశెర్లపల్లి, నేరెడుగొమ్మ, చిట్యాల, కేతేపల్లి, నల్లగొండ, త్రిపురారం, మాడుగులపల్లి, వేములపల్లి, దేరకొండ, చందంపేట్, గుండ్లపల్లి, కనగల్, మునుగోడు, నార్కెట్‌పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, మిర్యాలగూడ మండలాలు అత్యధిక ప్రభావానికి లోనయ్యాయి. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, అనంతగిరి, చిల్కూరు, పాలకీడు, చింతలపాలెం, నాగారం, తిరుమలగిరి, నూతన్‌కల్, జాజిరెడ్డిగూడెం, ఆత్మకూర్ (ఎస్), మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్, మునగాల, నడిగూడెం, కోదాడ, గరిడేపల్లి, నేరెడుచర్ల, మేళ్లచెరువు, తుంగతుర్తి, మద్దిరాల, మఠంపల్లి, హుజూర్‌నగర్ మండలాలను చేర్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, తుర్కపల్లి (ఎం), మోత్కూరు, రాజాపేట్, మూటకొండూర్, యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట్, అడ్డగూడూరు, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), చౌటుప్పల్, గుండాల, నారాయణ్‌పూర్, వలిగొండ మండలాలు ఉన్నాయి.
దక్షిణ తెలంగాణ, రాజధాని పరిసర జిల్లాల్లో మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, చిన్నచింతకుంట, కోయిల్‌కొండ, గండేడు, హన్వాడ, దేవరకద్ర, అడ్దకల్, మూసాపేట్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, కౌకుంట్ల మండలాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఊరుకొండ, వెల్దండ, చారగొండ, వంగూరు, ఆమ్రాబాద్, పాద్రా, బల్మూరు, లింగాల, పెద్ద కొత్తపల్లి, కోడేరు, బిజినేపల్లి, కల్వకుర్తి, అచ్చంపేట్ కాగా, జోగులాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్, ధరూర్, కాలూర్ తిమ్మనదొడ్డి, ఇటిక్యాల, మల్దకల్, గట్టు, ఐజ, రాజూలి, వడ్డేపల్లి, మనోపాడ్, ఉండవల్లి, ఆలంపూర్, ఎర్రవల్లి మండలాలు ఉన్నాయి. నారాయణ్‌పేట జిల్లాలో నారాయణ్‌పేట, దామరగిద్ద, మాగనూరు, కృష్ణ, మక్తల్, నరవ, మరికల్, ధన్వాడ, గుండుమల్, కోస్గి, మద్దూర్, ఉట్కూర్, కొత్తపల్లి మండలాలు.. వనపర్తి జిల్లాలో వనపర్తి, పెబ్బేరు, అమరచింత, పానగల్, కొత్తకోడ, ఆత్మకూర్, వీపనగండ్ల, ఏదుల, పెద్దమందాడి, ఘన్‌పూర్, గోపాల్‌పేట్ మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా చేర్చారు.

