కలం, ఆదిలాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవాన్ని అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం భోరాజ్ మండల పరిధిలోని పెన్‌గంగా నది తీరంతోపాటు ఆదిలాబాద్ (Adilabad) గ్రామీణ మండలంలోని చందా వాగు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా ఉన్నారు. భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ లాంటి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన బారికేడింగ్ ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించాలని పోలీసు, ఆర్టీఓ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ తదితర శాఖల సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

