Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీవర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. సోమవారం, మంగళవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో, పలుచోట్ల ఈదురుగాలులు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈనెల 18, 19, 20 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మరో 3 రోజులపాటు ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదని పేర్కొంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ట్రాఫిక్ జామ్.. సీఎం సీరియస్

భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులను అప్రమత్తంగా చేశారు. వర్షాలకు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్‌ (CURE)లో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్ల పైన ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అవసరమైయితే తాను కూడా రోడ్డు మీదకు వస్తానని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>