Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో పలుచోట్ల అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం (Heavy rains) దంచికొట్టింది. ఉదయం నుంచే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం మబ్బులతో వాతావరణం చల్లబడగా.. కాసేపటికే వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులు కూడా తోడవడంతో భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్  సహా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో హైదరాబాద్ సహా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, సిద్దిపేట, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, జగిత్యాల జిల్లాల్లో వర్షం దంచికొట్టింది.

ఈదురుగాలులతో గాలివాన..

హైదరాబాద్‌లో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మరోపోయింది. ఉరుములు, మెరుపులతో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో గాలివాన బీభత్సాన్ని సృష్టించడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని లింగంపల్లి, గచ్చిబౌలి మాదాపూర్, అమీర్ పేట, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మండుటెండలతో హైదరాబాద్ వేడెక్కిన తరుణంలో వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి నగరవాసులకి కాస్త ఉపశమనం లభించింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

అర్ధరాత్రి వర్షం దంచికొట్టడంతో పలు జిల్లాలో భారీగానే వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమొల్గరలో 11 సెంటీమీటర్లు, పర్పల్లి, భూత్పూర్‌లో 10 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్ టౌన్‌లో 7.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా డిండిలో 6.2 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 5.4 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో 5 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా దోమకొండ, సదాశివనగర్‌లో 5 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.

అకాల వర్షాలకు అన్నదాతల ఆందోళన..

అటు అకాల వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి చెమటోర్చి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ ధాన్యాన్ని అమ్ముకుందామని కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులకు అకాల వర్షం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వర్షం ధాటికి ధాన్యం కుప్పలు తడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని కాపాడేందుకు సరైన తార్పాలిన్ కవర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు నీటిపాలయ్యాయి. ఇక ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల వరి చేనులు నెలకొరిగాయి. ముఖ్యంగా వరి , మొక్కజోన్న, జొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>