Mobile Popup Ad
Mobile Popup Ad

శంషాబాద్ భూవివాదం.. అసలు నిజాలివే!

కలం, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దశాపూర్ భూముల (Shamshabad Land)పై హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. వాస్తవాలతో కూడిన సమగ్ర వివరణను ప్రెస్ నోట్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. పెద్దశాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 172-183 వరకు ఉన్న 170 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, మొత్తం ప్రక్రియ న్యాయస్థానం పర్యవేక్షణలోనే సాగుతున్నదని స్పష్టం చేసింది. ఆ సర్వే నెంబర్లలో 170 ఎకరాలు మొదటినుంచీ పట్టా భూములేనని, 1954-55 నాటి ఖాస్రా పహాణి, 1955-58 నాటి చేసాల పహాణి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 202తో కొనసాగాయని వివరించింది. కొత్త సర్వే నంబర్లు 172 నుండి 183 వరకు ఉన్న మొత్తం 170 ఎకరాల భూమి మొదటగా పట్టా భూములుగానే నమోదై ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. రాత్రికి రాత్రే మార్పులేమీ జరగలేదన్నది. ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ద్వారా 74.97 ఎకరాల భూమిని సీలింగ్ మిగులు భూమిగా ప్రకటించి, స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయని, ప్రస్తుతం నిషేధిత జాబితాలోనే ఉన్నాయని పేర్కొన్నది.

ఆర్డీవోను ఆదేశాలను బేఖాతర్ చేసి కేవలం నాలుగు రోజుల్లోనే తహశీల్దార్ ప్రైవేటు భూమిగా ఎలా మార్చారంటూ హరీశ్‌రావు ప్రశ్నించారని, కానీ నవాబ్ మొహమ్మద్ యూసుపుద్దీన్ ఖాన్‌తో పాటు మరో నలుగురి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదంటూ గతంలోనే వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ ప్రకటన పేర్కొన్నది. తాసీల్దార్ గతంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా 8 వారాల్లో కారణబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టు గతేడాది జనవరిలోనే ఆదేశించిందని పేర్కొన్నది. అధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో పిటిషనర్లు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారని గుర్తుచేసింది. ఆ పిటిషన్ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు తాసీల్దార్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న 94.28 ఎకరాల భూమి వారిదేనంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని వివరించింది.

ఎమ్మార్వో ఆదేశంతోనే భూ-భారతి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆ భూమిని ఎక్కించి మ్యుటేషన్ చేసినట్లు హరీశ్‌రావు ఆరోపణ నిజం కాదని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొన్నది. తాసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం భూ-భారతి పోర్టల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. ఈ భూములపై కొన్ని ప్రైవేటు సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో ఏప్రిల్‌లో యథాతథ స్థితి (స్టేటస్ కో) విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శంషాబాద్ తహశీల్దార్ ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, మ్యుటేషన్లు చేయకూడదని కూడా హైకోర్టు స్పష్టం చేసిందని ఆ ప్రకటన గుర్తుచేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ‘స్టేటస్-కో’లో ఉన్నందున లీగల్ ఒపీనియన్ ప్రకారం హైకోర్టు వెకేషన్ ముగిసిన వెంటనే, తాసీల్దార్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటన స్పష్టత ఇచ్చింది. ఈ కేసుపై హైకోర్టు తదుపరి విచారణ జూన్ 12న జరగనున్నదని తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>