కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టించాయి. కడప, శ్రీసత్యసాయి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి వర్షాలు దంచికొట్టాయి. పగటిపూట వేడిగాలులతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వర్షం మొదలవడంతో ఉమశమనం పొందారు. రాష్ట్రంలో భారీ వర్షాల ధాటికి పలుచోట్ల పిడుగుపాట్లు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలైంది. కల్లాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు లబోదిమోమంటున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో కురిసిన వర్షానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. దేవళం బజారు నుంచి వచ్చిన నీరు రాజగోపురం గుండా లోపలికి ప్రవేశించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. కడప జిల్లాలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీరు చేరి ప్రధాన రహదారులు, కాలువలు పొంగిపొర్లాయి. ఆ నీరంతా నివాసాల లోపలికి చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు సాగించలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె ఎస్సీ కాలనీలో పిడుగుపాటుకు గురై గూడూరు ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన పశువుల పాక కాలిపోయింది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఈదురుగాలులకు తాటిపర్తి వద్ద పాడేరు ఘాట్ రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయనగరం, మన్యం జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.

