కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లాలోని గజ్వేల్ (Gajwel) నియోజకవర్గంలో అర్ధరాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పలు మండలాలలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వివరాలలోకి వెళ్తే.. గజ్వేల్, జగదేవ్‌పూర్ తదితర మండలాలలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కల్లాలలో , రోడ్లపై ఆరబోసిన వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
బలమైన గాలుల ప్రభావంతో గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సుమారు 20 గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు విరిగిపడి రహదారులపై అడ్డుగా నిలిచాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాల కారణంగా గజ్వేల్ (Gajwel) ప్రాంతంలో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Read Also: ప్రైజ్ మనీ పెంచకపోతే టోర్నీలు బహిష్కరిస్తాం: సబలెంక
Follow Us On : WhatsApp

